IPL Auction 2025 Live

COVID19 in Telangana: తెలంగాణలో మరో 47 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1414కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, నేడు పలు అంశాలపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్షలు

అయినప్పటికీ మే15న అంటే ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించి లాక్డౌన్ పై సడలింపులను పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జోన్ల వారీగా....

Coronavirus outbreak in India (Photo Credits: IANS)

Hyderabad, May 15: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు రెండు, మూడు వారాల క్రితం కేవలం ఒకటి, రెండు అంటూ మాత్రమే వచ్చాయి. అయితే గత వారం రోజుల నుంచే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 6 రోజుల్లో సుమారు 250కి పైగా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనావైరస్ విజృంభన ఎంతకీ తగ్గడం లేదు. ఇటీవల కాలంలో తెలంగాణలో నమోదయ్యే మొత్తం కేసులు దాదాపు హైదరాబాద్ నుంచే వస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి 40 కేసులుండగా, రంగారెడ్డి జిల్లా నుంచి 5 మరియు వలస వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారించబడింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1414 కి చేరింది.

నిన్న మరో 13 మంది కోవిడ్-19 బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 952కు పెరిగింది. కొత్తగా మరణాలేమి నమోదు కాలేదు, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ప్రస్తుతం 34గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 428 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Telangana's #COVID19  Report

 

ఇక దేశంలో మరో 2 రోజుల్లో మూడో దశ లాక్డౌన్ ముగిసి, నాలుగో దశ లాక్డౌన్ అమలు కానుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అంతకుముందే ఈనెల 29 వరకు లాక్డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ మే15న అంటే ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించి లాక్డౌన్ పై సడలింపులను పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జోన్ల వారీగా మరిన్ని సడలింపులు లభించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. కరోనా లక్షణాలతో చనిపోయిన వారికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి: తెలంగాణ సర్కారుకు హైకోర్ట్ ఆదేశాలు

జిల్లాల నుంచి గత 2, 3 వారాలుగా ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ప్రతీరోజు పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కొంత ఆందోళన కలిగించే విషయం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి సొంతూళ్లకు చేరుకుంటున్న వారిలో కొందరికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ సడలింపులకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు వరస సమీక్షలు నిర్వహించనున్నారు.