Dalit Empowerment: లబ్దిదారులకు నిరంతరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యం, తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోవాలి! తెలంగాణ దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, అధికారులకు దిశానిర్ధేశం
తక్కువ కాలంలోనే ఆర్థిక వృద్ధి కలిగించే పరిశ్రమలను పెట్టించడం ద్వారా వారికి నిరంతరమైన జీవనోపాధి లభించే పథకాలను...
Hyderabad, July 20: రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం టీఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న 'తెలంగాణ దళిత బంధు' పథకం అమలు విధి విధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని సీఎం అన్నారు. తక్కువ కాలంలోనే ఆర్థిక వృద్ధి కలిగించే పరిశ్రమలను పెట్టించడం ద్వారా వారికి నిరంతరమైన జీవనోపాధి లభించే పథకాలను ‘తెలంగాణ దళిత బంధు’ పథకంలో భాగంగా రూపకల్పన చేసి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టు నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించి దళిత కుటుంబాల స్థితిగతులను అర్థం చేసుకోవాలి. వారి అభిప్రాయాలను సేకరించాలి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పలు రకాల పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలి. ముందు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఆదిశగా సెన్సిటైజ్ కావాలి.’’ అని వివరించారు.
ఉన్నతాధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఈ పైలెట్ ప్రాజెక్టుపై ముందుగా అవగాహన పెంచుకోవాలి, ఉపాధి కల్పించే పలు వినూత్న పథకాల రూపకల్పన కోసం క్షేత్రస్థాయి పర్యటనలను ఎలా చేపట్టాలి, ఆ సందర్బంగా ఎవరెవరిని కలవాలి, వారి నుంచి సమాచారం ఏ విధంగా తీసుకోవాలి, దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనుభవజ్ఞుల సలహాలను పాటించి వారి సూచనలను పథకంలో భాగంగా ఎలా అమలు పరచాలి అనే అంశాల మీద ముందుగా అధికారులు సిద్ధం కావాలి అని సీఎం సూచించారు.
ఇందులో భాగంగా ఉన్నతాధికారులు, ఉద్యోగులు, దళిత ప్రముఖులు, దళిత సంఘాల నేతలు, యాక్టివిస్టులతో కూడిన వర్క్ షాపు త్వరలో నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. వర్క్ షాప్ లో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి పైలట్ ప్రాజెక్టు చేపడుతున్న నియోజకవర్గంలోని దళిత వాడలకు వెళ్లాలని, అక్కడ దళిత కుటుంబాలతో మాట్లాడాలని, దళిత సమస్యలపై అవగాహన ఉన్న దళిత ప్రముఖులను కలిసి, వారి సలహాలు సూచనలతో వారు కోరుకున్న విధంగానే స్కీంలను రూపొందించాలని సీఎం తెలిపారు.
దళితుల అవసరాలు ఎలా ఉన్నాయి? అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించగానే ఎక్కువకాలం గ్యాప్ లేకుండా ఆదాయం సృష్టించుకునే విధంగా పథకం రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.