Digital Survey of Lands : త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే, రిజిస్ట్రేషన్లు- మ్యూటేషన్లు ఇకపై పారదర్శకం, రెవెన్యూ అధికారుల బాధ్యతలపై జాబ్ చార్ట్, సీఎం కేసీఆర్ సమీక్షలో కీలక నిర్ణయాలు
భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికారుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. సేద్యం చేసే పంటలు పండించాల్సిన రైతులు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యం కూడా. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యం. రెవెన్యూ శాఖలో....
Hyderabad, February 19: ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు వెల్లడించారు.
రెనెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు వెల్లడించారు.
‘‘ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమయింది. నోరులేని, అమాయకుల రైతులకు న్యాయం జరిగింది. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగింది. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగింది. డాక్యుమెంట్లు గోల్ మాల్ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయింది. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా జరిగిపోతున్నాయి. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. బయోమెట్రిక్, ఆధార్ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నది. ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిఫ్ట్ డీడ్ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో వేలుపెట్టి మార్పులు చేసే అవకాశం లేదు. చివరికి సిసిఎల్ఏ, సిఎస్ కూడా రికార్డులను మార్చలేరు. అంతా సిస్టమ్ డ్రివెన్(వ్యవస్థానుగత) పద్దతిన, హ్యూమన్ ఇంటర్ఫేస్ (మానవ ప్రమేయం) లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నది.
రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొందమందికి మింగుడు పడడం లేదు. ధరణి పోర్టల్ మీద చిలువలు, పలువలు ప్రచారం చేస్తున్నారు. అసంబద్ధమైన విషయాలు మాట్లాడుతున్నారు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారే అపోహలు సృష్టించి గందరగోళ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి ప్రజలు తికమక పడొద్దు. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలి. సందేహాలను నివృత్తి చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో జరిపే డిజిటల్ సర్వే వల్ల పరిష్కారం అవుతాయి. నేను అసెంబ్లీలో ఇంతకుముందే ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. ప్రతీ భూమికి కో ఆర్డినేట్స్ ఇస్తాం. వాటిని ఎవరూ మార్చలేరు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదు. నిజానికి ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల ఆగింది. అతి త్వరలోనే డిజిటల్ సర్వే ప్రారంభం అవుతుంది. ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ- ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుంది. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. 3-4 నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయి. కో ఆర్డినేట్స్ మారవు కాబట్టి భవిష్యత్తులో కూడా హద్దుల పంచాయతీకి అవకాశం ఉండదు. భూ రికార్డులు సక్రమంగా ఉన్న దేశాల్లో జిడిపి 3-4 శాతం వృద్ధి సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పుకు ప్రభుత్వం సిద్ధపడింది’’ అని సీఎం వివరించారు.
‘‘మారిన పరిస్థితుల్లో రెవెన్యూ స్వరూపం కూడా మారింది. రెవెన్యూ శాఖ విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయి. గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయి. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా 10వేల సాయం అందిస్తున్నది. కాబట్టి రెవెన్యూ అనే పేరు కూడా ఇప్పుడు సరిపోదు. పేరు మారే అవకాశం ఉంది. ధరణి పోర్టల్, డిజిటల్ సర్వే తదితర కారణాల వల్ల భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికారుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. సేద్యం చేసే పంటలు పండించాల్సిన రైతులు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యం కూడా. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యం. రెవెన్యూ శాఖలో ఎవరేమి పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్ చార్టు రూపొందిస్తుంది. ఆర్ఐ ఏం చేయాలి? తహసిల్దార్ ఏం చేయాలి? ఆర్డీవో ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తాం. రెవెన్యూ అధికారులను పనిచేయగలిగే, పని అవసరం ఉండే చోట ప్రభుత్వం వాడుకుంటుంది’’ అని సీఎం స్పష్టం చేశారు.
‘‘ఏమైనా సమస్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్లు ఆ దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలి’’ అని సీఎం సూచించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)