Independence Day 2023: గోల్కొండ కోట‌ నుంచి ప్రజలకు వరాల జల్లులు కురిపించిన సీఎం కేసీఆర్, జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి

గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలోని గూడు లేని నిరుపేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ స‌ర్కార్ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

CM KCR in Independence Day Celebrations (photo-TS CMO)

Hyd, August 15: ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని స్మారకం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం  గోల్కొండ కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలోని గూడు లేని నిరుపేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ స‌ర్కార్ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక్క రూపాయికి కూడా పేద‌ల‌కు ఖర్చు లేకుండా పేద‌ల‌కు ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించి ఇస్తోంది. 77వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని నిరుపేద‌ల‌కు సీఎం కేసీఆర్ తీపి క‌బురు అందించారు. నేటి నుంచే హైద‌రాబాద్‌లో ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను అంద‌జేస్తున్న‌ద‌ని కేసీఆర్ గోల్కొండ కోట వేదిక‌గా ప్ర‌క‌టించారు.

గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది అని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడక గదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నది. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నది.

సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది అని కేసీఆర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాలకన్నా ఎంతో ముందున్నది అని సీఎం స్ప‌ష్టం చేశారు. నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ఇచ్చుకున్నం. ఇప్పటివరకూ రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్‌మెంట్ అందించుకున్నాం. కరోనా విజృంభణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించిన తరుణంలోనూ ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌నే అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాల పెంపుదలను వర్తింపచేసింది. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవలి శాసనసభా సమావేశాల్లో నేను స్వయంగా ప్రకటించాను అని కేసీఆర్ గుర్తు చేశారు.

సింగరేణి కార్మికులకు బోన‌స్ రూ. 100 కోట్లు..

గత ప్రభుత్వాలు నష్టాలపాలు చేసిన సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదిద్దింది. కంపెనీ టర్నోవర్ ను 12 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెంచింది. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్ గా వెయ్యి కోట్లు పంపిణీ చేయబోతున్నదని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.

వీఆర్ఏల‌కు పేస్కేల్

నీరటి, మస్కూరీ, లష్కర్ వంటి కాలంచెల్లిన పేర్లతో పిలవబడుతూ, ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా మిగిలిన వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతిపత్తిని కలిగించింది తెలంగాణ ప్రభుత్వం అని కేసీఆర్ తెలిపారు. వీరి సేవలను క్రమబద్ధీకరిస్తూ పేస్కేలు అమలు చేసింది. వీరందరినీ విద్యార్హతలు, సామర్ధ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసింద‌ని పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని సీఎం తెలిపారు. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పుచెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందేలా పంచాయతీ కార్యదర్శులు ద్విగుణీకృత ఉత్సాహంతో నిరంతర కృషిని కొనసాగించాలని కోరుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకున్నదని చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే అప్పటివరకు రైతులకున్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసిందన్నారు.

రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంటరుణాల మాఫీ చేపట్టింది. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు చెందిన దాదాపు రూ.37 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. దేశం మొత్తం మీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. మిషన్ కాకతీయ, పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటిరంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందన్నారు.

24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయరంగాన్ని అద్భుతంగా స్థిరీకరించి, భారత దేశ వ్యవసాయ రంగ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏలుబడిలో సాగుబడి సుసంపన్నమైందని తెలిపారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నదని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పంజాబ్‌ను ఢీకొంటూ దేశంలోనే ప్రథమ స్థానానికి పోటీపడుతున్నదని చెప్పారు.

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్తు సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగిన విధంగా సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నాని అన్నారు.

‘సమైక్య రాష్ట్రంలో భయంకరమైన బాధలు అనుభవించి వలసల జిల్లాగా పేరుపడి గోసెల్లదీసిన పాలమూరుతోపాటు రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడతేర్చేందుకు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. 12 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతోపాటు, 1200 గ్రామాలకు తాగునీరందించే అమృతప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలను ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారు.

అయితే, న్యాయం ఎన్నటికైనా గెలుస్తుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలించాయి. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి. ఇటీవలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయని సంతోషంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయింది కనుక సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదల వహించి, అతి త్వరలోనే ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా పచ్చని పంటల జిల్లాలుగా తీర్చిదిద్దుతుందని హామీ ఇస్తున్నాను. తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్దిరోజుల్లోనే రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని’ సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఆదివాసీలు, గిరిజనుల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాం..

దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ ప్రభుత్వం.. వారిలో ఆనందం నింపిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1.50 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిందని చెప్పారు. వారందరికీ రైతుబంధు పథకాన్ని సైతం వర్తింపజేస్తూ పంట పెట్టుబడి సాయం అందించిందని, పోడు భూముల కోసం జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి విముక్తి కలిపించిందన్నారు.

హైద‌రాబాద్ న‌లుమూల‌ల‌కు మెట్రోను విస్త‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌చ్చే మూడు, నాలుగేండ్ల‌లో ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 67 వేల 149 కోట్ల వ్యయంతో వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ధి ప‌థ‌కం(ఎస్ఆర్‌డీపీ) అమలు చేస్తున్నద‌ని కేసీఆర్ తెలిపారు. ఎస్ఆర్‌డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఆర్వోబీల అభివృద్ధిని చేపట్టింది. వీటిలో చాలాభాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

రూ. 275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం పూర్తిచేసింది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులకూ మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 69 వేల కోట్లకు పైగా వ్యయపరచి ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి పైదరాబాద్‌ను అనుసంధానం చేస్తూ, నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకొనే విధంగా మెట్రో రైలును విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యం నిర్దేశించింది. కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్‌లో 415 కిలోమీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుంద‌ని కేసీఆర్ తెలిపారు.

పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్‌ పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, పరిశ్రమలకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు.

2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయని, పారిశ్రామిక రంగంలో గత తొమ్మిదిన్నరేండ్లలో 17.21 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ఐటీ రంగంలోనూ తెలంగాణ మేటిగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 6 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయని చెప్పారు.

2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57 వేల 258 కోట్లు కాగా, 2014 నుంచి 2023 నాటికి 2 లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగాయి. ఐటీ రంగాన్ని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేస్తూ, ప్రభుత్వం ఐటీ టవర్స్‌ను నిర్మించిందని తెలిపారు. తద్వారా గతానికి భిన్నంగా అభివృద్ధిని సైతం వికేంద్రీకరిస్తున్నదని చెప్పారు.

సంపద పెంచు.. ప్రజలకు పంచు..

‘సంపద పెంచు-ప్రజలకు పంచు’ అనే సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా తెలంగాణలో పేదరికం తగ్గుతున్నదని, తలసరి ఆదాయం పెరుగుతున్నదని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ స్పష్టం చేసిందన్నారు. జాతీయ స్థాయిలో నమోదైన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైందని చెప్పారు. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందని తెలిపారు. అంటే, ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో మౌలిక వసతుల కల్పన చేస్తూ సమగ్ర దృక్పథాన్ని అవలంభిస్తున్నదని వెల్లడించారు. దళిత బడుగు, బలహీన వర్గాలు, రైతాంగం మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకూ అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నదని చెప్పారు. వికేంద్రీకరణను ఒక విలువగా పాటిస్తూ పరిపాలనలో సంస్కరణలు చేసిందన్నారు.

అదే విధంగా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నదని వెల్లడించారు. అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాలను ఆదుకుంటున్నదని తెలిపారు. అందుకే నేడు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారని చెప్పారు. అతి పిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రతిభకు, పటిమకు తిరుగులేని నిదర్శనమని వెల్లడించారు.

రాష్ట్రంలో గ‌త నెల‌లో అనూహ్యంగా, అసాధార‌ణ స్థాయిలో భారీ వ‌ర్షాలు కురిశాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది అని కేసీఆర్ పేర్కొన్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, ఆయా ప్రదేశాలకు సుశిక్షితులైన సిబ్బందినీ, పడవలనూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను వినియోగించింది అని కేసీఆర్ తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి ఆదుకున్నది. తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లు విడుదల చేసింది. ఊహించనిరీతిలో కుంభవృష్టి కురిసి, వరదలు సంభవించినా, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని ప్రాణ నష్టాన్ని, ఆస్తినష్టాన్నిచాలావరకు నివారించగలిగింద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

అతివృష్టి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుంద‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్ళకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. వరదలలో కోతకు గురైన పొలాల సంఖ్యను అంచనా వేయడం జరుగుతున్నది. జూన్, జూలై మాసాల్లో వర్షపాతంలో కలిగిన లోటును ఈ భారీ వర్షాలు భర్తీ చేశాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాలూ నిండుకుండలుగా మారాయి. ఈసారి వరిసాగు రికార్డు స్థాయిలో 64 లక్షల 54 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అన్నివేళలా బాసటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇక‌పై తెలంగాణ‌లోని అనాథ పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం ఆర్ఫాన్ పాల‌సీని రూపొందించిన‌ట్లు పేర్కొన్నారు.త్వరలో తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నామని.. దీనిద్వారా గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్‌ మగ్గాలు అందిస్తామని సీఎం అన్నారు.ఇప్పటికే నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని చెప్పారు. నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీని అందిస్తూ నేతన్నకు చేయూతనిస్తున్నదని వెల్లడించారు. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా రూ.5 లక్షల బీమాను కల్పిస్తున్నదని చెప్పారు.

అసహాయులకు జీవన భద్రతకోసం అందించే పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.2,016కు పెంచిందన్నారు. 2014 నాటికి ఆసరా లబ్ధిదారుల సంఖ్య కేవలం 29 లక్షలని, నేడు వారి సంఖ్య 44 లక్షలకు పెరిగిందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతోపాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ సౌకర్యం కల్గించిందని చెప్పారు. పెన్షన్ పొందేందుకు వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించిందని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3016 నుంచి రూ.4016 రూపాయలకు పెంచిందని, తద్వారా దివ్యాంగుల బతుకుల్లో మరింత ధీమాను నింపిందని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కానీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింద‌ని సీఎం తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now