Telangana Sheep Distribution Scam: గొర్రెల పంపిణీ పథకం స్కాంలో కీలక మలుపు, ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఈడీ, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద విచారణ

ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Sheep Distribution Scam Representative image (Photo Credit- Pixabay)

Hyd, June 13: తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడీ ఫోకస్‌ పెట్టింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తోంది.ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఈడీ కూడా ఫోకస్‌ పెట్టింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో, మనీ లాండరింగ్‌ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. ఇక, జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.  తెలంగాణ గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్, దాదాపుగా 2.10 కోట్ల రూపాయల స్కాంకు పాల్పడ్డారని నిర్థారించిన ఏసీబీ

అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారనే అనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఈడీ కోరింది.

గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని విశ్వసనీయ సమాచారం.అసలు గొర్రెలు అమ్మింది ఒకరైతే, వాటి తాలూకు డబ్బు దళారుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇలా ఎలా చేశారన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు ఏసీబీ ప్రయత్నించింది.అయితే వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో మళ్లీ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరారు.

ఈ కేసులో ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్టై జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.