Delhi Liquor Scam Case: ఈ నెల 11న ఈడీ విచారణకు కవిత, ట్విస్టులతో సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, రేపు జంతర మంతర్ వద్ద ధర్నాలో పొల్గొననున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

మనీ లాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం ఈ నెల 9న (గురువారం) విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

Telangana Rashtra Samithi leader K Kavitha. (Credits: Facebook)

Hyd, Mar 8: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Scam Case) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. మనీ లాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం ఈ నెల 9న (గురువారం) విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

అయితే ముందస్తు కార్యక్రమాల వల్ల ఆ రోజు విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 11న రాగలనని కవిత ఈడీకి లేఖ రాశారు.కవిత లేఖపై ఈడీ.. గురువారం ఉదయం స్పందించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 11వతేదీన(శనివారం) విచారణకు (ED Will Examine MLC Kavitha On March 11) హాజరు కావాలని తెలిపింది. దీంతో, ఈడీ విచారణపై ఉత్కంఠకు తెరపడింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరుకావాలంటూ ఆదేశం, రామచంద్రపిళ్లై స్టేట్‌మెంట్‌పై నిజానిజాలు ఆరాతీసే అవకాశం

శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కవిత మాససికంగా సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. కాగా, లిక్కర్‌ స్కాం కేసులో​ భాగంగా అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబులతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు.. కవితను ముందస్తు బెయిల్‌ కోసం బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

రేపు(శుక్రవారం) జంతర్‌ మంతర్‌లో కవిత ధర్నాలో పాల్గొననుంది. ఈ ధర్నా కోసం 16 పార్టీలు, 29 సంఘాల నేతలకు ఆహ్వానం అందించారు. బీఆర్‌ఎస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, అకాలీదళ్‌, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్‌, ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్‌ పార్టీల ప్రతినిధులు హాజరవుతారని కవిత ఆఫీసు వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్ట్‌, రాబిన్‌ డిస్టిలరీస్‌ అధినేత రామచంద్ర పిళ్లై అరెస్ట్ చేసిన సీబీఐ, ప్రముఖులతో సంబంధాలున్నాయని ఆరోపణలు

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10న ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడతామని కవిత ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో.. అంతకు ఒకరోజు ముందే విచారణకు రావాలని ఈడీ నోటీసు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను, హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌రామచంద్రపిళ్లైని ఈడీ విచారణకు పిలిచి కటకటాల్లోకి పంపిన నేపథ్యంలో కవితకూ నోటీసు జారీ చేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబరు 11న సీబీఐ కవితను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే సుదీర్ఘంగా విచారించింది. అరుణ్‌ పిళ్లై రిమాండ్‌ నివేదికలో అతడిని కవితకు బినామీగా ఈడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈడీ గత డిసెంబరులో దాఖలు చేసిన 181 పేజీల అభియోగపత్రంలోనూ కవిత పేరును ప్రస్తావించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న సమీర్‌మహేంద్రుతో కలిసి ఆమె మద్యం వ్యాపారం నిర్వహించారని పేర్కొంది.

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన సమయంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నాడ్‌ రికార్డ్‌ సంస్థ ప్రతినిధి బినోయ్‌బాబుతో కలిసి కవిత పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని వెల్లడించింది. మద్యం హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులతో కలిసి సిండికేట్‌ ఏర్పాటు చేయడంలో కవిత, రాఘవ్‌, శరత్‌రెడ్డి తదితరులతో కూడిన సౌత్‌ గ్రూప్‌ కీలకంగా వ్యవహరించిందని పేర్కొంది.

ఈ గ్రూప్‌ ద్వారా రూ.100 కోట్ల ముడుపులు ఆప్‌ నాయకులకు హవాలా మార్గంలో అందాయని, వీటిలో రూ.30 కోట్లను హైదరాబాద్‌ నుంచే తరలించినట్లు ఆరోపించింది. ఈ అక్రమాల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2873 కోట్ల నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో ఆధారాల్లేకుండా చూసేందుకు నిందితులు 170 ఫోన్లు ధ్వంసం చేశారని.. అందులో కవిత వినియోగించిన రెండు ఫోన్లున్నాయని ఆరోపించింది.