Hyd, Mar 7: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ( ED arrests Hyderabad-based businessman) అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసింది. ఇంతకు ముందు అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) ఇటీవలె రెండు రోజులపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam Case) అరెస్ట్ అయిన వాళ్ల సంఖ్య 11కి చేరింది. రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న రామచంద్ర పిళ్లైని ఢిల్లీ మద్యం వ్యవహారంలో నిందితునిగా సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.
గతంలోనే ఈ స్కాంలో ఆయన్ని నిందితుడిగా చేర్చిన ఈడీ.. ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించింది. ఆయనకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తులను సైతం జప్తు చేసింది. ఇదిలా ఉంటే మనీలాండరింగ్ కేసును సవాల్ చేస్తూ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కోర్టు విచారణ చేపట్టనుంది.
తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులతో ఆయనకు సంబంధాలున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈడీ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. సీబీఐ నమోదు చేసిన కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లైకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.మరోవైపు మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను తొలిసారి ఈడీ అధికారులు ఇవాళ ప్రశ్నించనున్నారు. సోమవారం సిసోడియాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ప్రత్యేక కోర్టు పంపింది. తిహాడ్ జైలులో సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బుచ్చిబాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తు, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రామచంద్ర పిళ్లైకి చార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించాడు గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో, తద్వారా హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ లైసెన్సీలకు లాభం చేకూర్చడంలో పాత్ర పోషించినందుకు గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేతులు మారడంలో బుచ్చిబాబు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పనిచేసినట్లు ఆ మధ్య కొన్నికథనాలు కూడా తెరపైకి వచ్చాయి.