ED (Photo-ANI)

New Delhi, Feb 2: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో (Delhi liquor Scam case) కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. లిక్కర్‌ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఢిల్లీ కోర్టులో రెండో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దేశ రాజధానిలోని రోజ్‌ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది.కోర్టులో దాఖలు చేసిన మొత్తం 428 పేజీల రెండో చార్జ్‌షీట్‌లో కుట్ర జరిగిన తీరును ఈడీ సవివరంగా పేర్కొంది.

ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి/ఎక్సైజ్‌ మంత్రి మనీశ్‌ సిసోడియాతో పాటు 14 మందిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు గుర్తుచేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ (ED) రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha), వైసీపీ ఎంపీ మాగుంట (YSRCP MP Magunta) పేర్లు కూడాఉన్నాయి. కాగా సమీర్‌ మహేంద్రు స్టేట్‌మెంట్‌లో కేజ్రీవాల్‌ పేరు వెల్లడైంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై ఈడీ దూకుడు, తెలంగాణ, ఏపీతో సహా 40 ప్రాంతాల్లో సోదాలు, తెలంగాణలో హీటెక్కిన పొలిటికల్ టెన్సన్

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఈడీ చార్జిషీట్‌లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. ఇప్పటికే విచారించిన వారి లిస్టులో కవిత పేరును ప్రస్తావించారు. అలాగే ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కూడా కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. నవంబర్‌ 12, 2022న అరుణ్‌పిళ్లైని విచారించినప్పుడు కవిత గురించి తెలిసిందని ఈడీ పేర్కొంది.అరుణ్‌ పిళ్లై.. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఇండో స్పిరిట్స్‌లో పార్ట్‌నర్‌గా చేరారని తెలిపింది.ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్‌లో ఈడీ అధికారులు తెలిపారు.

ఆమ్‌ అద్మీ పార్టీతో కవితకు పూర్తి సమన్వయం ఉందని, ఢిల్లీలో మద్యం షాపులకు ముఖ్యంగా L1 షాపులను దక్కించుకునేలా పావులు కదిపారని ఈడీ తెలిపింది. కవిత ప్రత్యేక విమానంలో పలు మార్లు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వచ్చారని ఈడీ తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. లంచం ఇచ్చే వ్యవహారాన్ని కవిత పర్యవేక్షించి పని పూర్తయ్యేలా చేశారని ఈడీ ఆరోపించింది. రెండు నెంబర్లను ఏ ఏ సమయంలో వాడారో కూడా తేదీల వారీగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

బీజేపీలో చేరితే కేసులన్నీ క్లోజ్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు మెసేజ్, కావాలంటే త‌న తల న‌రుక్కుంటాను కానీ, అవినీతి నేత‌ల‌కు లొంగిపోన‌ంటూ ట్వీట్ చేసిన సిసోడియా

ఢిల్లీ మద్యం స్కామ్‌ డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.మద్యం కుంభకోణానికి సంబంధించి వంద కోట్ల ముడుపులు ఆమ్‌ అద్మీ పార్టీకి చేరాయని తెలిపింది.లంచంగా వచ్చిన వంద కోట్లను గోవా ఎన్నికల్లో ఆమ్‌ అద్మీ పార్టీ ఉపయోగించిందని ఆరోపించింది. గోవాలో పార్టీ వాలంటీర్లుగా పని చేసిన వారి కోసం ఈ డబ్బు ఖర్చు చేసినట్టు అందులో పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది.

ఈ కుంభకోణం కేసులో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పునరుద్ఘాటించింది. మద్యం పాలసీ కుంభకోణంలో సిండికేట్‌ కారణంగా ఢిల్లీ సర్కారుకు రూ. 2,873 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చార్జ్‌షీట్‌లో స్పష్టంచేసింది. నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేశారని, మొత్తం 170 ఫోన్లు వాడగా, అందులో 153 ఫోన్లను ధ్వంసం చేశారని, కేవలం 17 ఫోన్లు మాత్రమే రికవరీ చేశామని ఈడీ తెలిపింది.

ఈ కేసులో సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు(ఏ1)గా సమీర్‌ మహేంద్రు ఉండగా.. మద్యం వ్యాపారి బినయ్‌ బాబు, అమిత్‌ అరోరా, దక్షిణాదికి చెందిన విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, పి.శరత్‌ చంద్రారెడ్డిలను అరెస్టు చేసిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.

భారీ ఎత్తున అక్రమార్జనకు లోపభూయిష్టంగా విధానాన్ని రూపొందించారని తెలిపింది. హోల్‌సేలర్ల లాభాలను 12 శాతానికి నిర్ణయించారని, అందులో 6 శాతం మేరకు తిరిగి ముడుపులుగా చెల్లించాలనుకున్నారని, అందుకోసం ఖాతా పుస్తకాలను కూడా తారుమారు చేశారని వెల్లడించింది. ఈ కుట్రలో ఆప్‌కు మొత్తం రూ. 100 కోట్ల ముడుపులు అందాయని తెలిపింది. సమీర్‌ మహేంద్రు రూ. 295.45 కోట్ల మేర నేరానికి పాల్పడ్డారని, ఈ మేరకు సాక్ష్యాధారాలు లభించాయని ఈడీ పేర్కొన్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

హోల్‌సేల్ వ్యాపారంలో 12 శాతం లాభాలు, రిటైల్ వ్యాపారంలో 185 శాతం లాభాలు వచ్చేలా మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ వెల్లడించింది.ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సెక్రటరీ అరవింద్ పేరు కూడా ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఉంది. కీలక నిందితుడు విజయ్ నాయర్ కేజ్రీవాల్ క్యాంపు ఆఫీసు నుండి కార్యకలాపాలు కొనసాగించారని ఈడీ వెల్లడించింది. నిందితులకు కేజ్రీవాల్‌కు మధ్య విజయ్ నాయర్ అనుసంధాన కర్తగా వ్యవహరించారని తెలిపింది. సౌత్ గ్రూపు నుంచి 100 కోట్లు ముడుపులు విజయ్ నాయర్ అందుకున్నారని, సౌత్ గ్రూపునకు, ఆప్ లీడర్లకు మధ్య ఒప్పందంలో భాగంగానే ఈ ముడుపులు అందుకున్నారని ఈడీ వెల్లడించింది.

ఇండో స్పిరిట్‌లో సౌత్ గ్రూపునకు 65 శాతం భాగస్వామ్యం ఇచ్చారు. సౌత్ గ్రూపులో కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాఘవ సభ్యులుగా ఉన్నారు. సౌత్ గ్రూపు తరపున అభిషేక్ బోయిన్ పల్లి, రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించారు. ముడుపులుగా అందిన డబ్బును గోవా ఎన్నికలకు ఆప్ నేతలు వాడారని ఈడీ వెల్లడించింది. ముడుపులు అందించిన కారణంగా ఢిల్లీ లిక్కర్ సౌత్ గ్రూప్ అయాచిత లబ్ది పొందిందని తెలిపింది. 9 రిటైల్ జోన్స్‌లో సౌత్ గ్రూప్ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపారం చేసిందన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందన ఇదే..

ఢిల్లీ మద్యం స్కామ్‌ (Delhi liquor case) లో ఈడీ (ED) దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో తన పేరుండటంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ పనిచేస్తోందని ఆరోపించారు. ఈడీ ఛార్జ్‌షీట్ మొత్తం కల్పితమన్నారుు. ఈడీ ఇప్పటివరకూ 5 వేలకు పైగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిందని, అయితే ఇప్పటివరకూ ఎంతమందికి శిక్షలు పడ్డాయో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

చార్జ్‌షీట్‌లో చేర్చిన 17 మంది వ్యక్తులు, సంస్థల పేర్లు:

A1 - సమీర్‌ మహేంద్రు

A2 - రెస్టారెంట్‌ ఖావోగాలి

A3 - బబ్లీ బేవరేజేస్‌

A4 - ఇండో స్పిరిట్‌

A5 - ఇండో స్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌

A6 - విజయ్‌ నాయర్‌

A7 - శరత్‌ చంద్ర

A8 - ట్రైడెంట్‌ చెంపార్‌

A9 - అవంతిక కాంట్రాక్టర్స్‌

A10 - అర్గనామిక్స్‌ ఎకోసిస్టమ్స్‌

A11 - బినయ్‌ బాబు

A12 - రాజేశ్‌ మిశ్రాకు చెందిన పెర్నార్డ్‌ రికర్డ్‌

A13 - అభిషేక్‌ బోయిన్‌పల్లి

A14 - అమిత్‌ అరోరా

A15 - KSJM స్పిరిట్స్‌

A16 - బడ్డీ రిటైల్స్‌

A17 -పాపులర్‌ స్పిరిట్స్‌