File (Credits: Twitter)

New Delhi, March 08: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ నోటీసులు జారీ చేసింది(Ed Sent Notices). గురువారం ఈడీ ఎదుట జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను (Kavitha) అధికారులు విచారించబోతున్నారు.

ఈ కేసులో గతంలోనే ఈడీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రని ఈడీ ప్రస్తావించింది. పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గురువారం జరగబోయే విచారణ కీలకం కానుంది.