Stray Dog Attack: వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి, వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులకు గాయాలు కాగా ఏడు మేకలు మృతి

బానోత్ భరత్ అనే చిన్నారిని కొన్ని రోజుల క్రితం వీధికుక్కలు కరిచాయి. బాలుడిలో రేబిస్ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. అనంతరం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకురాగా అక్కడ మృతి చెందాడు.

BSF Probe on Sniffer Dog Pregnancy Representational Image | (Photo Credits: Dog Lovers Foundation/Facebook)

Khammam, Mar 14: తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వీధికుక్కలు దాడికి గురై ఓ చిన్నారి మృతి చెందింది. బానోత్ భరత్ అనే చిన్నారిని కొన్ని రోజుల క్రితం వీధికుక్కలు కరిచాయి. బాలుడిలో రేబిస్ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. అనంతరం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకురాగా అక్కడ మృతి చెందాడు.

బాలుడి తల్లిదండ్రులు, బి. రవీందర్, సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలం పుటాని తండాలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న అతనిపై వీధికుక్కలు దాడి చేయడంతో గాయపడ్డాడు.ఆదివారం చిన్నారి అస్వస్థతకు గురైంది. అనంతరం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు రేబిస్‌గా అనుమానించి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు.

అంబర్ పేట ఘటన మరువక ముందే మరో ఘటన, రోడ్డుపై పోతున్న వారిని ఇష్టమొచ్చినట్లుగా కరుచుకుంటూ పోయిన వీధి కుక్క, 10 మందికి తీవ్ర గాయాలు

రవీందర్, సంధ్య తమ కుమారుడితో కలిసి టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోనే చిన్నారి పరిస్థితి విషమించి సూర్యాపేట సమీపంలో సోమవారం మృతి చెందింది. భరత్ మెడికల్ రిపోర్టులను పరిశీలిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో వీధికుక్కల బెడదతో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో మరణం. గత నెలలో హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. బాలుడి తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కార్ సర్వీసింగ్ సెంటర్‌లో ఫిబ్రవరి 19న ఈ ఘటన జరిగింది. ఇక ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో వీధికుక్కలు దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు గాయపడగా, ఏడు మేకలు మృతి చెందాయి.

వీధి కుక్కల దాడిపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్, నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ, జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని మండిపడిన హైకోర్టు

ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ పరిధిలోని జిలుగుమడుగు గ్రామంలో ఐదేళ్ల దోర్నాల వివేక్ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో కుక్కలు కరిచాయి. అతని తండ్రి వచ్చి కుక్కలను తరిమికొట్టాడు. బాలుడి చేతులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వికారాబాద్ జిల్లాలో వీధికుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. శివకుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం పొలాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా వీధికుక్కలు అతనిపై దాడి చేశాయి. అతడి ముఖంపై తీవ్ర గాయాలు కాగా.. తొలుత నగర సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి, మహబూబ్‌నగర్‌కు తరలించారు.

గత నెల రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన సంఘటన తర్వాత, వీధి కుక్కల బెడదను అరికట్టడానికి మున్సిపల్ అధికారులు అనేక చర్యలు ప్రకటించారు, అయితే ఈ చర్యలు క్షేత్రస్థాయిలో ఇంకా అమలు చేయలేదని పౌరులు అంటున్నారు.