Free Vegetables: ఫ్రీగా కూరగాయలు.. పెద్దపల్లిలో భలే ఛాన్స్.. ఎగబడ్డ జనం.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)
వెయ్యితో బయటకు వెళ్తే, సంచీ నిండా కూరగాయలు రావడమే కష్టమైంది. ఇలాంటి సమయంలో కూడా పెద్దపల్లిలో మాత్రం కూరగాయలను ఉచితంగా అందిస్తున్నారు.
Hyderabad, Aug 27: ఇప్పటికే కూరగాయల ధరలు (Vegetables) ఆకాశానంటుతున్నాయి. వెయ్యితో బయటకు వెళ్తే, సంచీ నిండా కూరగాయలు రావడమే కష్టమైంది. ఇలాంటి సమయంలో కూడా పెద్దపల్లిలో (Peddapally) మాత్రం కూరగాయలను ఉచితంగా అందిస్తున్నారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులు సంచులుగా కూరగాయలు తీసుకొని వెళ్ళారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.
ఫ్రీగా ఎందుకంటే?
పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో హోల్ సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య గత కొంతకాలంగా వివాదం నెలకొన్నది. ఒప్పందం ప్రకారం హోల్ సేల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలు అమ్మవద్దని ఉన్నది. అయితే, ధరలు పడిపోవడంతో హోల్ సేల్ వ్యాపారులు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతున్నట్టు రిటైల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు నష్టం వాటిల్లుతున్నదంటూ ఆగ్రహించిన రిటైల్ వ్యాపారులు మంగళవారం కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు.