Telangana Municipal Polls: మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ కొట్టివేత, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం

ఈ క్రమంలో ఉత్తమ్ పిటిషన్ హైకోర్ట్ తోసిపుచ్చింది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 10 కార్పోరేషన్లకు మరియు 120 మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది....

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, January 7: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Polls) నిర్వహణకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ ఎన్నికలను ఆపాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), పలువురు నేతలు కలిసి వేసిన పిటిషన్లను హైకోర్ట్ మంగళవారం కొట్టివేసింది.

రిజర్వేషన్లు ఖరారు కాకముందే, ఎన్నికల సంఘం మున్సిపల్  ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం నిబంధనలకు విరుద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన హైకోర్ట్ (High Court) ఈరోజు విడుదలవాల్సిన ఎన్నికల నోటిఫికేషన్‌ను నేడు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వాయిదా వేసింది.

మరలా ఈరోజు రెండో విచారణ జరిపిన హైకోర్ట్, ఇరు పక్షాల వాదనలు విని కీలక ఆదేశాలు జారీ చేసింది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను ఆపలేమని స్పష్టం చేసింది.  ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ, ఎన్నికల నిబంధనల విషయంలో సర్వాధికారాలు ఎన్నికల సంఘానికే ఉంటాయని పేర్కొంది. ఈ క్రమంలో ఉత్తమ్ పిటిషన్‌ను హైకోర్ట్ తోసిపుచ్చింది. మిగతా అన్నీ పిటిషన్లను కొట్టివేసింది.

అయితే వార్డుల విభజన సరిగా జరగలేదనే పిటిషనర్ వాదనతో మహబూబ్‌నగర్, వనపర్తి మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్ కార్పోరేషన్ లోని 3, 24, 25వ వార్డు ఎన్నికలపై మాత్రం హైకోర్ట్ స్టే విధించింది.

దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 10 కార్పోరేషన్లకు మరియు 120 మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం ఈరోజు జనవరి 7న విడుదల కావాల్సిన ఎన్నికల నోటిఫికేషన్ కోర్ట్ పిటిషన్ కారణంగా కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు మార్గం సుగమం అవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాత్రి 8 గంటలకు ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇదివరకు ప్రకటించినట్లుగా జనవరి 22న పోలింగ్, జనవరి 25న కౌంటింగ్ మరియు ఫలితాల వెల్లడి జరగనున్నాయి.