Telangana Municipal Polls: నోటిఫికేషన్‌కు స్పీడ్ బ్రేకర్! తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన హైకోర్ట్, ఎన్నికల కమీషన్ నిబంధనలు పాటించలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పిటిషన్
High Court of Telangana| Photo Credits: Wikimedia Commons

Hyderabad, January 7: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ (Telangana Municipal Polls Notification) కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిబంధనలు పాటించలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్, రేపు (జనవరి 07న) విడుదల కావాల్సి ఉన్న ఎన్నికల నోటిఫికేషన్ ను సాయంత్రం వరకు ఆపాల్సిందిగా ఎన్నికల కమీషన్ ను (High Court) ఆదేశించింది. ఈలోపు ఎన్నికల మ్యాన్యువల్, ఇతర వివరాలు సమర్పించాలని సూచించింది.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పలు అంశాలను లేవనెత్తారు. ముందు రిజర్వేషన్లను ప్రకటించి తర్వాత, నోటిఫికేషన్ జారీ చేయాలి, ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించాలి. కానీ ఈ నిబంధనలేవి ఈసీ పాటించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా రిజర్వేషన్లను ఖరారు చేయకుండానే జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యేటట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం, కాబట్టి చట్టవిరుద్ధమైన ఈ నోటిఫికేషన్ ను సవరించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని, అందుకు తగిన సవరణలు చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.  ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. లింక్ క్లిక్ చేయండి!

ఈ వాదనలు విన్న ధర్మాసనం, విచారణ పూర్తయ్యే వరకు రేపు విడుదల కావాల్సిన నోటిఫికేషన్ పై తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ విచారణల నేపథ్యంలో మరోసారి మున్సిపల్ ఎన్నికల తేదీలపై మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.