Hyderabad, December 24: ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల (Telangana Muncipal Polls)కు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2020, జనవరి 22 నుంచి తెలంగాణలోని 120 మునిసిపాలిటీలు, 10 మునిసిపల్ కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana State Election Commission) సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొంది.
షెడ్యూల్ ఇలా ఉంది.. జనవరి 7న ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ (Notification) విడుదల చేయనుంది. జనవరి 8న పురపాలక, నగరపాలక సంఘాలు ఎన్నికల ప్రకటన విడుదల చేస్తాయి, అదే రోజు ఉదయం 10:30 తర్వాత నుంచి నామినేషన్ల స్వీకరణ. జనవరి 11న నామినేషన్ల పరిశీలన. తిరస్కరణకు గురైన రీనామినేషన్లు చేసినవి ఏవైనా ఉంటే, జనవరి 13న మరోసారి పరిశీలన, జనవరి 14 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఇచ్చారు.
ఇక అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ఈసీ 6 రోజుల సమయం కేటాయించింది. జనవరి 15 ఉదయం నుంచి జనవరి 20 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపింది
ప్రచార తేదీలలో రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు అనుమతి. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తారు.
జనవరి 22న (Polling Date) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. అనివార్య కారణాలచే పోలింగ్ రద్దయినా లేదా వాయిదా పడినా, జనవరి 24న పోలింగ్ నిర్వహిస్తారు. జనవరి 25న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
డిసెంబర్ 30 వరకు ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఫోటో ఓటరు ముసాయిదా జాబితాను ఫోటో ఎలక్టోరల్ రోల్స్
విడుదల చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 02 వరకు అభ్యంతరాల స్వీకరణ, జనవరి 3వరకు అభ్యంతరాల పరిష్కారం, జనవరి 4న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది.