Hyderabad News: కంటి చూపు లేకపోవడంతో పక్కనే కొడుకు చనిపోయినా గుర్తించలేని వృద్ధ తల్లిదండ్రులు.. మూడు రోజులు మృతదేహంతోనే సావాసం.. పస్తులతో నీరసించిన వృద్ధులకు పోలీసుల సాయం (వీడియో)
వాళ్లకు కంటిచూపు లేదు. తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారు.
Hyderabad, Oct 29: బయటి ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు (Old People) వాళ్లు. వాళ్లకు కంటిచూపు (Eye Sight) లేదు. తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్తూ ఎదురు చూడసాగారు. మూడు రోజులైంది. అయితే, ఇక్కడ షాకింగ్ ఘటన ఏంటంటే, వాళ్లు ఎదురుచూస్తున్న వాళ్ల కొడుకు ఎక్కడికో పోలేదు. వాళ్ల పక్కనే మూడు రోజులుగా ఉన్నాడు. అయితే, అతను పడిఉన్నది నిర్జీవంగా. కంటి చూపు లేకపోవడంతో ఈ విషయాన్ని ఆ తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు. అయితే,మూడు రోజులుగా ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడం.. ఏదో దుర్వాసన వస్తుండటంతో కంగారు పడిన స్థానికులు ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Here's Video:
అసలేం జరిగింది?
నాగోల్ కు చెందిన రమణ, శాంతకుమారికి కంటి చూపులేదు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ప్రదీప్ కుమార్, ప్రమోద్ కుమార్ ఉన్నారు. ప్రమోద్ కుమార్ తన భార్యతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉండేవాడు. ప్రమోద్ కుమార్ కు తరచూ ఫిట్స్ వచ్చేవి. పైగా మద్యానికి బానిసయ్యాడు. ప్రమోద్ మద్యానికి బానిసగా మారడంతో నాలుగు సంవత్సరాల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం మద్యం తాగి వచ్చిన ప్రమోద్ కుమార్ కు ఫిట్స్ రావడంతో ఇంట్లోనే మృతి చెందాడు. మూడు రోజులైంది. కొడుకు ఇంకా ఇంటికి రాలేదని కండ్లులేని ఆ వృద్ధ దంపతులు ఎదురుచూడసాగారు. మూడ్రోజులుగా ఆకలితో అలమటించారు. కాగా, రోజులు గడువడంతో ప్రమోద్ మృతదేహం నుంచి దుర్వాసన రాసాగింది. అయితే, ఇంట్లో ఏదో ఎలుక చనిపోయిందని ఆ ముసలివాళ్లు అనుకున్నారు.
కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒటి డీకొన్న 5 కార్లు
అలా వెలుగులోకి
మూడు రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడం.. ఇంట్లో నుంచి ఏదో దుర్వాసన వస్తుండటాన్ని గ్రహించిన స్థానికులు విషయాన్ని నాగోల్ పోలీసులకు తెలియజేశారు. సోమవారం మధ్యహ్నం ఒంటి గంట సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తొలగించి లోనికి వెళ్లిన పోలీసులు ఇంట్లోని వాతావరణం చూసి కంగుతిన్నారు. ఒకవైపు కుళ్లి పోయిన స్థితిలో మృతదేహం పడి ఉండగా.. మరోవైపు ఇద్దరు దివ్యాంగులు ఏమి తెలియని స్థితిలో ఉండటాన్ని చూసిన పోలీసులు చలించిపోయారు. రమణ, శాంతకుమారిలను ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి ఆకలితో అలమటిస్తున్న వారికి భోజన సదుపాయాన్ని కల్పించారు.