Drug Peddlers Arrested in Hyd: ఆ హీరోయిన్ భర్తే డ్రగ్స్ సప్లయిలో కీలక సూత్రధారి,హైదరాబాద్ డ్రగ్స్ కేసులో బయటపడ్డ షాకింగ్ విషయాలు, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్– న్యూ) జరిపిన దాడుల్లో తాజాగా ఇద్దరు పట్టుబడ్డారు. పట్టుబడిన ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ (Mohit Agarwal) అలియాస్ మైరోన్ మోహిత్‌ను, మరో వ్యక్తిని అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు (Drug Peddlers Arrested in Hyd) చేశారు
Hyd, Jan 3: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్– న్యూ) జరిపిన దాడుల్లో తాజాగా ఇద్దరు పట్టుబడ్డారు. పట్టుబడిన ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ (Mohit Agarwal) అలియాస్ మైరోన్ మోహిత్‌ను, మరో వ్యక్తిని అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు (Drug Peddlers Arrested in Hyd) చేశారు. వారి వద్దనుంచి మూడు గ్రాముల కొకైన్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను హెచ్‌న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు.
మోహిత్ అగర్వాల్ భార్య నేహా దేశ్‌పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని, గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు.హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన మోహిత్ 2014లో ‘ది అన్‌స్క్రిప్టెడ్’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్‌కు డీజేలు సరఫరా చేస్తున్నాడు.
గోవాలో సన్‌బర్న్ బీచ్ క్లబ్ సహా అనేక భారీ ఈవెంట్స్ నిర్వహించాడు. ఆయా పబ్స్ నిర్వాహకులతో కలిసి వాటిలో ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్‌సహా దాదాపు 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి నుంచే కొకైన్ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు.ఇటీవలే గోవాలోని డ్రగ్ డాన్‌లలో ఒకడిగా పేరొందిన ఎడ్విన్‌ను హెచ్‌న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా పలువురి పేర్లు వెల్లడించాడు.
అతడి నెట్‌వర్క్ గురించి పూర్తిగా తెలుసుకున్న హెచ్‌న్యూ ఒక్కొక్కరిపై నిఘా పెట్టి అరెస్టు చేస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరన్ మోహిత్‌పై దృష్టి పెట్టారు. కొన్నాళ్లు పబ్బుల్లో పనిచేసిన మోహిత్ డీజే ఈవెంట్లు చేశాడు. కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో డీజేలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాడు. అతడి ఆధ్వర్యంలో హైదరాబాద్, గోవా, బెంగళూరు, ముంబైలో పబ్బులు, ప్రైవేట్ కార్యక్రమాల్లో డీజేలు నడుస్తుంటాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ సంపాదించాడు.
గతేడాది అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసి షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ సహా పలువురిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్ కూడా అదే క్రూయిజ్‌లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడం, ఆర్యన్‌తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు.
మోహిత్ ‘డిసెంబర్ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. వేట కొనసాగించిన హెచ్–న్యూ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకుంది. రామ్‌గోపాల్‌పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్ కేసులోనూ రిమాండ్‌కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.
అయితే వారిలో ఎందరు డ్రగ్స్ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ దందాలో మోహిత్ భార్య నేహా దేశ్‌పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్‌పాండే ‘ది కిల్లర్, దిల్ దివానా, బెల్స్’తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు.
ఎడ్విన్‌తో సంబంధాలు ఉన్న బంజారాహిల్స్‌కు చెందిన మరో వ్యక్తి మాన్యం కృష్ణ కిశోర్‌రెడ్డిని హెచ్‌న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ పూర్తి చేసిన కిశోర్, ప్రస్తుతం కేఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రోడ్డు కాంట్రాక్టర్‌గా వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. తరచూ పబ్‌లు, గెస్ట్‌హౌస్‌లలో ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నాడు. గోవాకు వెళ్లి ఎడ్విన్‌ను కలుస్తూ డ్రగ్స్ తీసుకున్నాడు. ఎడ్విన్ ద్వారా బెంగళూర్‌లో ఉన్న డ్రగ్స్ మాఫియాతో పరిచయాలు పెంచుకున్నాడు. ట్రావెల్ రంగంలో ఉన్న పలువురి సహాయంతో కిశోర్ హైదరాబాద్‌కు డ్రగ్స్ తెప్పించుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్‌న్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ బృందం రాంగోపాల్‌పేట్ పోలీసులతో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసింది. అతడి నుంచి రెండు గ్రాముల కొకైన్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.