Non-COVID Services in Gandhi Hospital: జూలై 19 నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్‌కోవిడ్ సేవలు, కోవిడ్, బ్లాక్‌ఫంగస్ వార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపిన గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో (Non-COVID Services in Gandhi Hospital) అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది.
Hyderabad, July 13: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో (Non-COVID Services in Gandhi Hospital) అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి కోవిడ్, నాన్‌కోవిడ్ సేవలు (non-COVID services) అందించాలని ఆస్పత్రి అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి గాంధీలో కేవలం కోవిడ్ బాధితులకు మాత్రమే వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న క్రమంలో నాన్‌కోవిడ్ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గాంధీలో 215 కరోనా, 179 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు వైద్యసేవలు పొందుతున్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్న 44 మందిని సోమవారం డిశ్చార్జీ చేసినట్లు నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నాన్‌కోవిడ్ సేవలను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు.
ఆర్థో ఐసీయూ, సెకండ్ ఫ్లోర్‌తో పాటు లైబ్రరీ భవనంలో కోవిడ్, బ్లాక్‌ఫంగస్ వార్డులు ఏర్పాటు చేస్తామని, గతంలో మాదిరిగా క్యాజువాలిటీ, ఓపీ, ఐపీ భవనాల్లో నాన్‌కోవిడ్ సేవలు కొనసాగుతాయని వివరించారు. థర్డ్‌వేవ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తీవ్రత ఏమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.