'Jesus Removed Covid': ఏసు ప్రభువు దయతోనే కరోనా అంతమైంది, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్, నా మాటలు వక్రీకరించారంటూ డాక్టర్ శ్రీనివాసరావు మండిపాటు
వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్నారు.
Hyd, Dec 22: కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు (Telangana Health Director G Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్నారు. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని, కేవలం ఏసు ప్రభువు కృప వల్లే కరోనా తగ్గిందని (Jesus Removed Covid) ఆయన అన్నారు. మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని చెప్పారు.
క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవులు లేకపోతే ప్రపంచ దేశాల్లో భారత్ మనుగడ సాగించేది కాదని అన్నారు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై ఆయన (Telangana Health Director) తరువాత స్పందించారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని శ్రీనివాసరావు అన్నారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి వివాదాన్ని సృష్టించాయని అసహనం వ్యక్తం చేశారు. దీన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంపూర్ణ సహకారం, ఇతర శాఖల మద్దతుతోనే కరోనాను నియంత్రించగలిగామని తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ మండిపడుతోంది. ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాట్లాడటం ముమ్మాటికి తగదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరిస్తోంది. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా.. కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా.. హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదని తీవ్రంగా హెచ్చరిస్తోంది.
Here's Video
శ్రీనివాసరావు మాటలను తప్పుపడుతూ బుధవారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఈ ప్రకటన విడుదల చేశారు. తమ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులందరినీ హిందూ క్రైస్తవులుగా విభజించి, క్రైస్తవులకు మేలు కలిగే విధంగా ఆయన మాట్లాడారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని తప్పుపట్టారు.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం నేరం కాదా? అని వారు ప్రశ్నించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టులో ఆయనపై కేసు వేసి సస్పెండ్ చేసేదాకా పోరాడుతామని హెచ్చరించారు.
మూఢనమ్మకాల పేరుతో పూజలు నిర్వహించి వైద్య విధానాన్ని అభాసుపాలు చేసే విధంగా వ్యవహరించారన్నారు. వెంటనే శ్రీనివాస్ రావు పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హెచ్చరించారు.