Keesara Bribe Case: కీసర కేసులో మిస్టరీగా మారిన ఆత్మహత్యలు, నాగరాజు ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకే ధర్మారెడ్డి ఆత్మహత్య, పోలీసుల వేధింపులతోనే అంటున్న కుటుంబ సభ్యులు
ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజులకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో (Dharma Reddy commits suicide) కనిపించడం అనుమానాలకు తావిస్తోంది.
Keesara, Nov 9: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ అవినీతి కేసు కేసులో (Keesara Bribe Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజులకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో (Dharma Reddy commits suicide) కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. కాగా ఓ భూవివాదంలో అప్పటి కీసర తాసిల్దార్ నాగరాజు (Keesara Ex MRO) రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.
కేసు (Keesara Corruption Case) విచారణ జరుగుతున్న క్రమంలో చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ గా ఉన్న నాగరాజు గత నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. నెలరోజులు గడువక ముందే ఇదే కేసుకు సంబంధించిన మరో నిందితుడు కందాడి ధర్మారెడ్డి(70) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడురోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ధర్మారెడ్డి ఆదివారం తెల్లవారు జామున కుషాయిగూడ వాసవి నగర్‌లోని శివాలయ ప్రాంగణంలో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి తరలించారు.
కాగా ధర్మారెడ్డి అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన ధర్మారెడ్డి మృతదేహాన్ని కుటుంబసభ్యులు కుషాయిగూడలోని నివాసానికి తీసుకొచ్చారు. తన సొంత గ్రామంలోని దయారలో ధర్మారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే అధికారుల వేధింపులతోనే ధర్మారెడ్డి చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలంటూ జైల్లో ఉన్న కొడుకు పెరోల్ పిటిషన్ దాఖలు చేశారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర గ్రామానికి చెందిన ధర్మారెడ్డి బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. రాంపల్లి దాయరలోని సర్వే నంబర్ 621 నుంచి 635 వరకు 90 ఎకరాలకు సంబంధించి టెనెంట్ కేసు ఉన్నదని ధర్మారెడ్డి అప్పటి తహసీల్దార్ దివంగత నాగరాజును కలిశాడు. అప్పట్లోనే దాని మీద ఉన్న పీటీని రద్దు చేయించుకున్నాడు. నాగరాజు నుంచి 24 ఎకరాల భూమికి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. నాగరాజు కేసు విచారణ సమయంలో ఈ విషయం ఏసీబీ దృష్టికి వచ్చింది. దీంతో ధర్మారెడ్డిని, అతడి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. 33 రోజులు జైలులో ఉన్న ధర్మారెడ్డి ఇటీవలే బెయిల్‌పై వచ్చాడు. కాగా శ్రీకాంత్‌రెడ్డికి ఇంకా బెయిల్ లభించలేదు.
బెయిల్‌పై ఇంటికి వచ్చినా ధర్మారెడ్డికి పోలీసుల వేధింపులు ఆగలేదని బంధువులు అంటున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టుకొచ్చి సంతకం చేసి వెళ్లాలని చెప్పారని, ఆరోగ్యం సహకరించట్లేదని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని కుటుబం సభ్యులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కోర్టుకు వెళ్లలేక, మరోపక్క కొడుకుకు ఇంకా బెయిల్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కాగా నవాబుల నుంచి వారసత్వంగా సంక్రమించిన 96 ఎకరాలకు ధర్మారెడ్డి తండ్రి నారాయణరెడ్డి 1950 నుంచి 58 మధ్యకాలంలో టెనెంట్‌గా ఉన్నారని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. రెండేళ్ల పాటు పన్నులు చెల్లించడంతో 38ఈ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కిషన్‌సింగ్ అనే వ్యక్తి రికార్డులను తారుమారుచేసి కొందరికి ఆ భూమి విక్రయించాడు. దీనిపై విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్ అందులో 24 ఎకరాలకు ధర్మారెడ్డితో పాటు అతని ముగ్గురి సోదరుల పేరుపై పట్టా పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.
అయితే, ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని, 29న అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులను అన్యాయంగా అరెస్టు చేశారని వారు అంటున్నారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి అప్పటికే లంచం కేసులో అరెస్టయి ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజుపై.. ధర్మారెడ్డి పేరిట అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలను సృష్టించారనే ఆరోపణలతో ఏసీబీ మరో కేసు నమోదు చేసింది.