తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ వీడియో వైరల్ అయింది. ఓ ప్రాణం నిలబెట్టడానికి హైదరాబాద్ నగరంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ (Hyderabad Police Viral Video) ఆంబులెన్స్ ట్రాఫిక్‌లోచిక్కుకుపోవడాన్ని, వేగంగా ముందుకు వెళ్లలేకపోవడాన్ని గమనించాడు. ఆంబులెన్స్ (ambulance) ముందు తాను పరిగెడుతూ, ఎక్కడికక్కడ ముందున్న వాహనాలను పక్కకు వెళ్లాల్సిందిగా సూచిస్తూ, బైక్‌లు, ఆటోలు, కార్లు అందరినీ పక్కకు జరిపిస్తూ ఆంబులెన్స్‌కు రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్లాడు. అలా చివరకు ట్రాఫిక్ తగ్గి, ఆంబులెన్స్ కొంచెం వేగంగా ముందుకు వెళ్లేంత వరకు అలాగే చేశాడు.
ఆ కానిస్టేబుల్ పేరు జి.బాబ్జీగా తెలిపారు. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం అయిన మొజాంజాహీ మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ బాబ్జీ ఏకంగా ఓ కిలోమీటర్ దూరం అలా రోడ్డు మీద పరుగులు పెట్టాడు. వాస్తవానికి అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి ముగిసిన తర్వాత కూడా మరికొంత దూరం ముందుకు వెళ్లాడు.
Here's Hyderabad City Police Tweet
ప్రతి అడుగు ప్రజల కోసం,
మీ భద్రతే మాకు ముఖ్యం. pic.twitter.com/ze9ErLSft7
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) November 4, 2020
మొజాం జాహీ మార్కెట్ నుంచి జీపీఓ, ట్రూప్ బజార్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వరకు తీసుకుని వెళ్లాడు. ఆ ఆంబులెన్స్‌లో ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియో తీశారు. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఇలా రోడ్డు మీద పరుగులు పెడతూ రోడ్డు మీద ట్రాఫిక్ క్లియర్ చేయడం చూసి అందులో ఉన్నవారు బాబ్జీకి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయారు.
ఈ వీడియోను హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి అడుగు ప్రజల కోసం, మీ భద్రతే మాకు ముఖ్యం అనే కామెంట్‌తో ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోకు ఇప్పటి వరకు సుమారు 32వేల వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కానిస్టేబుల్‌ను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. అతడికి అవార్డు ఇవ్వాలని కొందరు కోరారు. ఆ కానిస్టేబుల్ లాగే మీరు కూడా ఆంబులెన్స్‌కు దారివ్వండి అంటూ మరికొందరు కామెంట్ చేశారు.