Patnam Narender Reddy Remand Report: కలెక్టర్ పై దాడి ఘటన వెనుక కేటీఆర్ హస్తం! పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించాం. నిందితుడు విశాల్ తోపాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో కలెక్టర్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడని తేలింది.
Hyderabad, NOV 13: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో బీఆర్‌ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి (PatnamNarender Reddy) రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. లగచర్లలో అధికారులపై దాడి ఘటన వెనుక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఉన్నారని పట్నం నరేందర్‌రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో (remand report) పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించాం. నిందితుడు విశాల్ తోపాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో కలెక్టర్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడని తేలింది.
హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్‌రెడ్డి రెచ్చగొట్టాడు. నిందితుడు బోగమోని సురేష్‌ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్‌వాష్ చేశాడు. నిందితులకు ఆర్థిక,నైతిక సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించాడు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని మళ్లించాడు. భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని.. లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టాడు. అన్ని రకాల మద్దతు ఉంటుందని.. తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు, నిందితుడు సురేష్‌కు హామీ ఇచ్చాడు నరేందర్ రెడ్డి.
పట్నం నరేందర్‌రెడ్డి నేరపూరిత కుట్రను రూపొందించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారు. నిందితుడు పట్నం నరేందర్‌రెడ్డి ఉదయం 07:02 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నాం. విచారణలో నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు నరేందర్‌రెడ్డి.
అలాగే తమ పార్టీ ప్రముఖ నాయకుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్‌రెడ్డి చెప్పాడు. రాజకీయ మైలేజీని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు సురేష్‌ను ఫోన్‌లో తరచుగా సంప్రదించి వారి చర్యలను అంచనా వేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. నిందితుడు బి. సురేష్ సీడీఆర్ డేటాలో కూడా ఆధారాలు లభించాయని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు.