Hyderabad:పెళ్లికి ఒప్పుకోలేదని ఇంటికి వెళ్లి మరీ యువతి పీక కోసిన ఉన్మాది, ఆపై కరెంట్ స్తంభం ఎక్కి వైర్లు పట్టుకొని ఆత్మహత్యాయత్నం, యువతి మృతి
పెళ్లికి నిరాకరించిందని యువతిని దారుణంగా హత్యచేశాడు. అడ్డుకోబోయిన ముగ్గురు యువతులను గాయపరిచాడు. అనంతరం అతడూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
Hyderabad, AUG 29: బెంగాల్‌కు చెందిన గ్రీష్మ అనే యువతి గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి తండాలో ఉంటూ నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నది. ఆమె గతంలో పనిచేసిన చోట కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరు దగ్గరయ్యారు. అయితే కొన్నిరోజులుగా అతడిని గ్రీష్మ దూరం పెడుతూ వస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి గోపన్‌పల్లిలోని గ్రీష్మ ఇంటికి వెళ్లిన రాకేశ్.. తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబడ్డాడు. దీనికి ఆమె తిరస్కరించడంతో కూరగాయలు కోసే కత్తిలో ఆమెను పొడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందింది. అడ్డుకోబోయిన ఆమె స్నేహితురాళ్లను కూడా పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కాగా, కనకమామిడి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి రాకేశ్ ఆత్మహత్యా యత్నం చేశాడు. విద్యుదాఘాతంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని దవాఖానకు తరలించారు. అయితే ప్రస్తుతం రాకేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.