TS Covid Update: హైదరాబాద్‌లో ప్రమాదకరంగా కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 355 కేసులు నమోదు, రాష్ట్రంలో తాజాగా 2,251 కోవిడ్ కేసులు నమోదు, మాస్కులు ధరించని 6,500 మందిపై పోలీసులు కేసులు నమోదు
గత 24 గంటల్లో కొత్తగా 2,251 పాజిటివ్ కేసులు (TS Covid Update) నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఈమేరకు వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో 565 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
Hyderabad, April 11: కోవిడ్ సెకండ్ వేవ్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,251 పాజిటివ్ కేసులు (TS Covid Update) నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఈమేరకు వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో 565 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక 24 గంటల్లో ఆరుగురు కరోనాతో ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 355 కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాతి స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (258), నిజామాబాద్ జిల్లా (244) ఉన్నాయి. ములుగు జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసులు 3,29,529కి (COVID19 in Telangana) చేరుకోగా... 3,05,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,765 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 92.82 శాతంగా ఉంది. దేశ రికవరీ రేటు 89.9 శాతం కావడం గమనార్హం.
కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతోన్న నేపథ్యంలో ఎవరైనా మాస్కు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సుమారు 6,500 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
వారిలో అత్యధిక మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో కలిపి మాస్క్‌లు ధరించని 3,500 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మాస్కు పెట్టుకోని వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద జరిమానా విధించడమే కాకుండా వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు కావాలని పోలీసులు చెబుతున్నారు.