KTR Fire On Modi: మోదీలా అబద్దాలు ఆడాలంటే చాలా ధైర్యం కావాలి! ఉపన్యాసం ఇవ్వడం...ఉత్తచేతులతో వెళ్లడం మోదీకి అలవాటే అంటూ ఫైరయిన మంత్రి కేటీఆర్
45 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ (Kazipet Coach Factory) స్థానంలో రైల్వే రిపేర్ షాప్ పేరుతో ప్రధానమంత్రి తెలంగాణ ప్రాంతానికి ఏదో గొప్ప మేలు చేసినట్లు చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని కేటీఆర్ తెలిపారు.
Hyderabad, July 08: వరంగల్ జిల్లా వేదికగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొనసాగిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటు విమర్శలు చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్ అని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌కు రూ. 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని, రూ. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేది. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ (KTR Fire on Modi) అని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీ పర్యటన మొత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రి ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి మోదీ కేవలం ఇక్కడి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు. మోదీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా చెబితే బాగుండేదన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో అడుగడుగునా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని గుర్తుంచుకొని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఆ పార్టీని తెలంగాణ నుంచి ప్రజలు తన్ని తరిమేస్తారని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.
45 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ (Kazipet Coach Factory) స్థానంలో రైల్వే రిపేర్ షాప్ పేరుతో ప్రధానమంత్రి తెలంగాణ ప్రాంతానికి ఏదో గొప్ప మేలు చేసినట్లు చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా తన సొంత రాష్ట్రానికి రూ. 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీని మోసపూరితంగా తరలించుకుపోయిన మోదీ సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనే నినాదం.. గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్‌గా మారిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాలలో అడిగిన బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పునః ప్రారంభం, తెలంగాణలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి మొదలుకొని, నూతన రైల్వే లైన్లు ఏర్పాటు, రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను పక్కన పెట్టిన ప్రధానమంత్రి తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారని, సరైన సమయంలో బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
నరేంద్ర మోదీ మాదిరిగా అనర్గళంగా అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధానమంత్రి మాటలు ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకువచ్చి, 700 రైతుల మరణాలకు కారణమైన ప్రధానమంత్రి ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం అన్ని సూచీల్లోనూ ముఖ్యంగా, ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి మొదలుకొని పెరిగిన విస్తీర్ణం, సాగునీటి విప్లవం, రైతు సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న విషయం ప్రధానమంత్రి మోదీ తెలుసుకుంటే మంచిది అని హితవు పలికారు. కార్పొరేట్ మిత్రులకు పన్నెందున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేసే అవకాశం ఉన్నా, ఎందుకు ఇప్పటిదాకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దేశానికి గోల్డెన్ పీరియడ్ వచ్చిందని, యువత ఈ బంగారు కాలాన్ని వినియోగించుకోవాలన్న ప్రధానమంత్రి అసలు దేశంలోని యువత కోసం గత తొమ్మిది సంవత్సరాలలో చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా చెప్పి ఉంటే బాగుండేదని కేటీఆర్ అన్నారు. ఒకవైపు దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పెంచిన తన అసమర్ధ పాలనపై ప్రశ్నిస్తే పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే అంటూ అవహేళన చేసిన మోదీ యువత గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 16 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను శాశ్వతంగా ప్రైవేటుపరం చేస్తున్న ప్రధానమంత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైన మాట్లాడడం గురువింద సామెత కన్నా హీనంగా ఉందన్నారు. తెలంగాణ యువతకు లక్షలాది ఉద్యోగాలను అందించే అవకాశం ఉన్న ఐటిఐఆర్ ప్రాజెక్టును ప్రభుత్వంలోకి రాగానే రద్దు చేసిన మోదీ ఇక్కడి ఉన్నత విద్యావంతులకు చేసిన మోసాన్ని ఎన్నటికీ తెలంగాణ యువత మరిచిపోదని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ కుటుంబ పాలన గురించి, అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన దానికంటే దారుణంగా ఉందన్నారు కేటీఆర్. బీజేపీలో అనేక రాష్ట్రాల్లోని నాయకుల కుటుంబ సభ్యులు, స్వయంగా తన కేబినెట్‌లోని మంత్రుల వరకు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే అనే విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుంచుకుంటే మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి, వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది అని కేటీఆర్ తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)