New Year 2023: తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఇరు రాష్ట్రాల పోలీసులు, పూర్తి వివరాలు ఇవిగో..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఇదివరకే హెచ్చరించారు.
Hyd, Dec 30: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలకు తెలుగు రాష్ట్రాలు (Telugu States) సిద్ధం అవుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఇదివరకే హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 31వ తేదీ శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (special restrictions ahead of NYE) విధించారు. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బేగంపేట్, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. న్యూఇయర్ వేడుకలకు ఎక్కువ కోలాహలం కనిపించే.. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను అనుమతించమని చెప్పారు.
ట్రక్కులతో పాటు ఇతర భారీ వాహనాలను రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్‌లోకి అనుమతించరు. ఇక నగర వ్యాప్తంగా కఠినంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయని పోలీసులు తెలిపారు.వీవీ స్టాచ్యూ, ఎన్టీఆర్ మార్గ్, రాజ్ భవన్ రోడ్, బీఆర్కే భవన్, తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, రవీంద్ర భారతి, ఖైరతాబాద్ మార్కెట్, నెక్లెస్ రోటరీ, సెన్‌సెషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి, సంజీవయ్య పార్క్, పీవీఎన్ఆర్ మార్గ్, మినిస్టర్ రోడ్, సైలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్ రోడ్, లోయర్ ల్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. మింట్ కంపౌండ్ రహదారిని కూడా మూసివేయనున్నారు.
ఏపీలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక ఏపీలో విజయవాడ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ప్రకటించింది పోలీస్ శాఖ. ఈ మేరకు వేడుకలకు సంబంధించి ఆంక్షలను శుక్రవారం నగర సీపీ కాంతిరానా టాటా ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేకులు కట్ చేస్తూ హడావిడి చేయడం లాంటి చర్యలు కుదరవని హెచ్చరించారు.
బార్ అండ్ రెస్టారెంట్లు అనుమతి ఇచ్చిన సమయానికి మించి తెరవకూడడదు. అలాగే డీజేలకు అనుమతి తీసుకోవాలి. ఈవెంట్స్ ఆర్గనైజర్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వాహకులు పోలీసు అనుమతి తీసుకోవాలని, అర్ధరాత్రి 12 గంటల వరకు వేడుకలు నిర్వహించినా.. జనం మాత్రం ఒంటిగంటకల్లా ఇళ్లకు చేరుకోవాలని ముందస్తు సూచన చేశారు.
అలాగే.. ఫ్లై ఓవర్లు మూసేస్తామని, రాత్రిళ్లు రోడ్లపై తిరగడం కుదరదని ప్రజలకు తెలిపారు. విజయవాడలో 31 రాత్రి తర్వాత.. 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో అవుతుందని ప్రజలకు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ స్పష్టం చేశారు.