Covid Vaccination కరోనా టీకా ఇవ్వమంటే కుక్కకాటు వ్యాక్సిన్ ఇచ్చారు, నల్గొండ జిల్లాలో నర్సు నిర్లక్ష్యం, దాంతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన మండల వైద్యాధికారి కల్పన, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Nalgonda, June 30: కోవిడ్ టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్క కాటు వ్యాక్సిన్ (Rabies vaccine) ఇచ్చిన ఘటన నల్గొండ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ (Coronavirus Vaccination) కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకుని ఆమె మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లారు. అయితే ఆమెకు చదువు రాకపోవడంతొ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ కు వెళ్లకుండా పీహెచ్‌సీ భవనంలోకి వెళ్లింది.
పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పీహెచ్‌సీకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు నర్సు యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ను వేసిందని.. కొవిడ్ టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకూ అదే సిరంజీతో యాంటి రేబిస్ వ్యాక్సిన్ (nurse inject rabies vaccine instead of covid vaccine) ఇచ్చిందని ఆమె ఆరోపించారు.ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు.
ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా ‘బాధితురాలు కరోనా టీకా బ్లాక్‌లోకి కాకుండా, యాంటిరేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదు. టీటీ ఇంజక్షన్ ఇచ్చాం. దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలిపారు. అయినా కూడా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత నిర్లక్ష్యంగా ఇంజక్షన్లు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.