Ponguleti in TPCC Committee: పార్టీలో చేరిన నెల రోజులకే పొంగులేటికి కీలక పదవి.. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామకం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత హస్తం పార్టీ ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది.
Hyderabad, July 15: మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) దూకుడు పెంచింది. కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత హస్తం పార్టీ ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ (BJP)ను గద్దె దింపి, అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీని పార్టీ హైకమాండ్ తాజాగా ప్రకటించింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీని నియమించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవి
నెల రోజుల క్రితమే కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవిని అప్పగించారు. ప్రచార కమిటీ కోఛైర్మన్ గా ఆయనను నియమించారు. కన్వీనర్ గా సయ్యాద్ అజ్మతుల్లా హుస్సేనీని ప్రకటించారు. మరో 37 మందిని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియమించారు. పీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, శాసనమండలిలో పార్టీ నేత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్లు, రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాలు, శాఖలు, సెల్స్ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు.