Telangana Lockdown: తెలంగాణలో ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్, రాష్ట్రంలో 44కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇద్దరు డాక్టర్లకూ సోకిన వైరస్

భర్త ద్వారా ఆమెకు సోకినట్లు తేలింది. ఈ క్రమంలో వైరస్ సోకిన వారి ద్వారా వేరొకరి సంక్రమించినటు వంటి కేసులు రాష్ట్రంలో 9కి చేరగా,...

Telangana Lockdown | PTI Photo

Hyderabad, March 26: తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు (COVID 19 in Telangana)  నిర్ధారణ అయింది. అయితే ఇందులో ఇద్దరు డాక్టర్లు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల దిల్లీలో పర్యటించి వచ్చిన కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ సోకింది. కరోనావైరస్ సోకిన వ్యక్తితో కలిసి తిరగడం వల్ల ఇతడికీ సంక్రమించినట్లు తెలిసింది. హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన డాక్టర్‌(41)తో పాటు ఆయన భార్య(36)కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. భర్త ద్వారా ఆమెకు సోకినట్లు తేలింది. ఈ క్రమంలో వైరస్ సోకిన వారి ద్వారా వేరొకరి సంక్రమించినటు వంటి కేసులు రాష్ట్రంలో 9కి చేరగా, మొత్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గురువారం 44కు చేరింది. ఈ ముగ్గురికీ కూడా ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్సనందిస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 43 అని ప్రభుత్వం ధృవీకరించింది. ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.

రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి జరగకుండా, ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ ఏప్రిల్ 16 వరకు (Telangana Lockdown Period) కొనసాగుతుందని సీఎం నిర్ణయించినట్లుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.

ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, వైరస్ లక్షణాలున్నాయనే అనుమానముంటే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది. 'ట్రావెల్ హిస్టరీ' 14 రోజుల పాటు బయటకు ఎక్కడికి వెళ్లకుండా హోం క్వారైంటైన్ లో ఉండాలని తెలిపింది. ఎలాంటి సందేహాలున్నా 104కు కాల్ చేయాల్సిందగా సూచించింది.