Praja Palana Applications: నేటి నుంచి ప్రజా పాలన.. ఐదు పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 100 కుటుంబాలకు ఒక కౌంటర్
గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది.
Hyderabad, Dec 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) నేటి నుంచి ప్రజా పాలన (Praja Palana) కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి ఐదు పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది. డిసెంబర్ 31, జనవరి 1 సెలవు దినాలు పోగా మొత్తం ఎనిమిది రోజులపాటు కొనసాగనున్న కార్యక్రమానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి మండలానికి తాసీల్దార్, డిఫ్యూటీ తాసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఈఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రతి మండలంలో నిత్యం రెండు గ్రామాల్లో సభలను నిర్వహించేలా షెడ్యూల్ ను రూపొందిస్తున్నారు. దరఖాస్తు పత్రాలను ప్రజలకు వివిధ శాఖల సిబ్బందితో ప్రభుత్వమే అందించి స్వీకరించే ఏర్పాట్లు చేసింది.
100 కుటుంబాలకు ఒక కౌంటర్
ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత గ్రామ సభను ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం 100 కుటుంబాలకు ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా స్వీకరించిన దరఖాస్తులను ఏ రోజుకారోజు ఆన్ లైన్ లో నమోదు చేయనున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ప్రస్తుతానికి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ గృహాలు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది.