Warangal: నాలుగు రోజుల చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు, సగానికి పైగా తినడంతో ఆడా? మగా? కూడా గుర్తుపట్టని రీతిలో శిశువు మృతదేహం
ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును (New born) పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బంధువులు కుక్కలను చెదరగొట్టారు
Warangal, AUG 09: వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును (New born) పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బంధువులు కుక్కలను చెదరగొట్టారు. ఎంజీఎం క్యాజువాలిటీ ఎదుట ఈ ఘటన చోటు చేసుకున్నది. కుక్కలు (Stray Dogs) దాదాపు శిశువు సగ భాగాన్ని తినేశాయి. ఆ తర్వాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఎంజీఎం మార్చూరిలో భద్రపరిచారు. అయితే, శిశువు మగనా.. ఆడనే అనే విషయం తెలియరాలేదు. శిశువు ఆనవాళ్లు గుర్తించడం కష్టంగా మారింది.
శిశువును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకువచ్చాయా? ఎవరైనా శిశువు మృతదేహాన్ని పడేసి వెళ్లారా? అనేది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువును ఎవరు పడేసి వెళ్లారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.