Telangana: తెలంగాణలో బస్సు కారు ఢీ, అదుపుతప్పి లోయలో పడిన రెండు వాహనాలు, పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 11 మందికి గాయాలు
ఈ ఘటనలో రెండు వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి (1 dies, 16 Injured after TSRTC bus falls into gorge) దూసుకెళ్లాయి.
Hyd, Oct 5: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బట్టుపల్లి సమీపంలోని గాడుదలగండి గుట్టపైన బస్సు-కారు ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. మంథని నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి (1 dies, 16 Injured after TSRTC bus falls into gorge) దూసుకెళ్లాయి.
ప్రమాదంలో మంథని మండలం ఖాన్‌సాయిపేటకు చెందిన కారు డ్రైవర్ వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉండగా 11 మందికి గాయాలయ్యాయి. ఇందులో తీవ్రంగా గాయపడిన భూపాలపల్లికి చెందిన లక్ష్మి, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సోఫియా, శ్వేత, మరియా, అంజయ్యను మెరుగైన చికిత్స కోసం గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మి, మరియా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళుతున్న పరకాల డిపో బస్ ఏపీ 36జెడ్ 0161 మంథని వైపుకు వస్తున్న కారు టీఎస్ 04ఎఫ్ సీ 9774ను ఢీ కొట్టిన తరువాత బస్ లోయలో పడిపోయింది.
లోయలో పడిన బస్సు దుర్ఘటనపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ ఆర్‌ఎంలను మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు కావల్సిన వైద్య సేవల కోసం సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గాయాలకు గురైన ప్రయాణీకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధిత కుటుంబసభ్యులకు తమ విచారం వ్యక్తం చేశారు.