Hyd, Oct 5: తెలంగాణ అసెంబ్లీ వేదికగాప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన (CM KCR announces mega recruitment drive) చేశారు. రెండు, మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు.
వచ్చే బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.20వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీలో ప్రకటించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో (TS Monsoon Session 2021) దళితబంధు పథకంపై జరిగిన చర్చపై సమాధానం ఇచ్చారు.దళితబంధు హుజూరాబాద్ కోసం తెచ్చింది కాదన్నారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకున్నదని, సిద్దిపేటలో దళితచైతన్య కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. దళిత మహిళా సంఘాలు ఏర్పాటు చేశామని, ఇన్నాళ్లు విద్యుత్, తాగునీరు, సాగునీరుకి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. మిషన్ కాకతీయతో భూర్భజలాలు పెరిగాయని, మిషన్ కాకతీయ పనులు చేపట్టిన ఏ చెరువుకు కూడా గండిపడలేదని స్పష్టం చేశారు.
మార్చిలోపు వంద నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామన్నారు. దళితబంధు నిధులు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రమంతా ఖర్చు చేస్తే రూ.1.80లక్షల కోట్లు అవసరమవుతాయని, సందేహం లేదు మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, దళితబంధు అమలు చేస్తామన్నారు. పథకానికి రూ.3వేలకోట్లు ఖర్చు చేస్తామన్నారు. నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేదేనని చెప్పారు.
వచ్చే బడ్జెట్‌లో రూ.20వేలకోట్లు ఖర్చు చేస్తామని, వచ్చే బడ్జెట్‌లో నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళితబంధు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. రూ.10లక్షలతో ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని, లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టుకోవచ్చన్నారు. దళితుల రక్షణ కోసం నిధి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ లైసెన్స్ అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఒక్క హుజూరాబాద్ కోసం అబద్ధాలు ఆడుతామా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ మినహా ప్రతి జిల్లాలో 20 శాతం మంది ఎస్సీలు ఉన్నారని, అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 26.64శాతం, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 17.53 ఎస్సీ జనాభా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనన్నారు. కుల గణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామని.. ఎన్ని తీర్మానాలు పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు సైతం రైతుబంధు ఇచ్చామని, ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా దళితబంధు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తామని.. ఓటు ఎవరికైనా వేసకోవచ్చన్నారు. దళితబంధుతో ముడిపెట్టమని, పార్టీకలతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందించాలనేదే మా లక్ష్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దళిత బంధుపై సుదీర్ఘ చర్చ అనంతరం శాసన సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.