Hyd, Oct 5: దళిత బంధు హుజూరాబాద్ కోసం పెట్టలేదు. కరోనా కన్నా ముందే దళిత బంధు ఆలోచన చేశాం. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమయ్యింది. దీనిపై విపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో (Telangana Assembly ) అసహనం వ్యక్తం చేశారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశంలో (Telangana Assembly Session 2021) సీఎం కేసీఆర్ దళిత బంధు సహా పలు అంశాలపై మాట్లాడారు. ఈ దేశంలో నేటికి కూడా వెనకబడిన సామాజిక వర్గం దళితులే. వారు దయనీయ స్థితిలో ఉన్నారు. సామాజిక వివక్ష కారణంగానే దళితులు పేదరికంలో ఉన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళితులందరి పరిస్థితి ఇలానే ఉంది. వారిని అభివృద్ధి చేయడం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇలాంటి పథకం (Telangana CM Dalit Bandhu Scheme 2021) దేశంలో ఎక్కడా లేదు’’ అని కేసీఆర్ తెలిపారు. దళిత బంధు కింద 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. అందులో 1,400 కోట్ల రూపాయలు మాత్రమే దళితులకు వెళ్తున్నాయి. దళిత ఎంపవర్‌మెంట్ కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఈ నేపథ్యంలో వారి అభివృద్ధి కోసం దళితబంధు తీసుకొచ్చాం. ఈ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాయి’’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరతరాలుగా సామాజిక వివక్షకు గురైన జాతి దళిత జాతి అని, 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత సైతం దళితుల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. స్వాతంత్య్రానికి ముందు కూడా దళిత జాతి హింసకు గురైందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ ఉజ్వలమైన పాత్ర పోషించారని, క్రమంగా అంబేద్కర్ ఆలోచనా సరళి బయటకు వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడింది కూడా అంబేద్కర్ పుణ్యమే అని గతంలో చెప్పానన్నారు.
రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉండాలని అంబేద్కర్ చెప్పారని, అంబేద్కర్ అనేక పోరాటాలు సాగించారన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు సాధికారత చేకూర లేదని, గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చిందన్నారు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదని, అనేక పార్టీలు పాలించాయన్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక భిన్నమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయని.. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని చెప్పారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతున్నారని, 75లక్షల మంది దళితులు ఉంటే 13లక్షల భూములే ఉన్నాయన్నారు. నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పు రాలేదన్నారు.
పాలమూరు వంటి జిల్లా నుంచి లక్షల మంది వలసలు వెళ్లారని.. తెలంగాణ ఏర్పాటును విఫలప్రయత్నమని చెప్పే ప్రయత్నాలు జరిగాయన్నారు. బాలారిష్టాల్ని అధిగమించుకుంటూ సంక్షేమం కోసం పాటుపడ్డామన్నారు. ఆసరా పింఛన్లు పెంచామని.. వికలాంగుల పింఛను రూ.3వేలకు పెంచినట్లు చెప్పారు. తెలంగాణలో 3కోట్ల టన్నుల వరిధాన్యం పడుతోందని, తెలంగాణలో వ్యవసాయ రంగ స్థిరీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పచ్చదనం కనిపిస్తోందని, రాష్ట్రంలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని.. ప్రకృతి సైతం సహకరిస్తోందని చెప్పారు. విభజనకు ముందు ఏపీలో ఎకరం అమ్మినా తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనే పరిస్థితి లేదని.. వ్యవసాయంలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
ఇప్పుడు ఒక ఎకరం తెలంగాణలో అమ్మి.. ఆరు ఎకరాలు ప్రకాశం జిల్లాలో కొనే పరిస్థితి ఉందన్నారు. ఉచిత విద్యుత్‌తో రైతులకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కోటి29లక్షల ఎకరాలు సాగవుతోందని.. యాసంగిలో 65లక్షల ఎకరాలు సాగులో ఉందని వివరించారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేశామని, నీటి తీరువా పన్నే లేదన్నారు. ఉచిత నీరు, విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 26లక్షల టన్నుల ఎరువులు వినియోగిస్తున్నామని, గతంలో 8లక్షల ఎరువులు మాత్రమే వినియోగించారన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు రూ. 80 కోట్ల నిధులు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు.. 2017-18లో రూ.38 కోట్లు, 2018-19లో రూ.49 కోట్లు, 2019-20లో రూ.46 కోట్లు, 2020-21లో రూ.80 కోట్లు, 2021-22 ఏడాదికి రూ.80 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులుండి, ఎక్కువ మంది ఉపాధ్యాయులున్న పాఠశాలలను గుర్తించే రేషనలైజేషన్ చేస్తున్నామని తెలిపారు. ఆ పోస్టులను సర్దుబాటు చేసిన తర్వాత విద్యావాలంటీర్ల నియామకం గురించి ఆలోచిస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 ఎకరాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మైదానం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రకృతి వనాల ఏర్పాటుకు కలెక్టర్లకు తామే ఆదేశాలు ఇచ్చామన్నారు.