Hyd, Oct 3: తెలంగాణ హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. ఈటల రాజేందర్ కే (Ex-Telangana Minister Etela Rajender) టికెట్ ను కన్ఫర్మ్ చేసింది. బీజేపీ అధిష్ఠానం దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దాంతో పాటు మిజోరాంలోని తురివాల్, మహారాష్ట్రలోని చెగలూరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకూ అభ్యర్థులను ప్రకటించింది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈటలపై ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రభుత్వం మీద ప్రత్యారోపణలు చేస్తూ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక తప్పనిసరైంది.అప్పట్నుంచి ఈటల ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజులపాటు పాదయాత్ర కూడా చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలను ప్రకటిస్తారు.
ఇప్పటికే టీఆర్ఎస్ తన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నిలిపింది. తొలిరోజే ఆయన నామినేషన్ వేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని, హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తమదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రచారంలో అన్నారు.
ఇటు కాంగ్రెస్ కూడా నిన్ననే అభ్యర్థిని ప్రకటించింది. విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరు వెంకట్ కు (NSUI State president Venkat Balmuri) టికెట్ ను ఇచ్చింది. గత ఆరేళ్లుగా బల్మూరు వెంకట్ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బల్మూరి వెంకట్‌తో పాటు స్థానిక నేతలు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్‌ను బరిలో నిలపాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బల్మూరి వెంకట్ పేరును ఖారారు చేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.