Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పూర్తి కథనం, కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానల్లో విజయం
ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమై డీలా పడింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గజ్వేల్‌లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించగా.. ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు.
119 స్థానాల్లోనూ పోటీ చేసిన భారత రాష్ట్రసమితి.. 80 చోట్ల ఓడిపోయింది. ఆ పార్టీకి చెందిన మంత్రుల్లో కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సబితారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌లు గెలిచారు. ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌లు పరాజయం పాలయ్యారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(RevanthReddy) కూడా రెండుచోట్ల పోటీ చేసినా.. కొడంగల్‌లో మాత్రమే గెలిచారు. కామారెడ్డిలో మూడో స్థానానికి పరిమితమయ్యారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రెండు చోట్లా ఓడిపోయారు.ఈ సారి మెరుగ్గా సీట్లు పొంది కింగ్ మేకర్ కావాలనుకున్న బీజేపీ మొత్తం ఎనిమిది సీట్లకే పరిమితమైంది.ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన ముగ్గురు ఎంపీలు సహా మిగిలిన అభ్యర్థులందరూ పరాజయాన్ని మూట కట్టుకున్నారు.
Here's ANI Tweet
ఇక రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 29 స్థానాలకు గాను.. బీఆర్ఎస్ 18 స్థానాలను సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం మూడు సీట్లే దక్కాయి. బీజేపీ సిటింగ్ స్థానమైన గోషామహల్‌ను మళ్లీ దక్కించుకోగా, ఎంఐఎం తన ఏడు స్థానాల్లో పట్టు నిలుపుకొంది. కేసీఆర్, రేవంత్‌రెడ్డి పోటీపడిన కామారెడ్డి స్థానంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి నిజామాబాద్ జడ్పీ మాజీ ఛైర్మన్ కె.వెంకటరమణారెడ్డి ఆ ఇద్దరు దిగ్గజాలను ఓడించి జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు పొందారు.
సీపీఐ పోటీ చేసిన ఏకైక స్థానం కొత్తగూడెంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కె.పి.వివేకానంద 85,576 ఓట్ల తేడాతో ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అత్పల్ప మెజార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీయే నమోదు చేసింది. చేవెళ్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి కేవలం 268 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సీపీఐ కొత్తగూడెం స్థానాన్ని దక్కించుకోగా, 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ, 19 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎంలు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయాయి.ఇక బీజేపీ గత రెండు ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించింది. 2014లో అయిదు, 2018లో ఒక స్థానంలో మాత్రమే గెలిచిన ఆ పార్టీ బలం ఈసారి 8 స్థానాలకు పెరిగింది.
39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ 65 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 13 చోట్ల మూడో స్థానంలో, మలక్‌పేట, యాకుత్‌పుర నియోజకవర్గాల్లో నాలుగోస్థానంలో నిలిచింది.ఇక 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 26 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 25 చోట్ల మూడో స్థానానికి, సిర్పూర్, చాంద్రాయణగుట్ట, కార్వాన్‌లలో నాలుగో స్థానానికి, బహదూర్‌పురలో అయిదో స్థానానికి పరిమితమైంది. ఎనిమిది నియోజకవర్గాలను గెలుచుకున్న బీజేపీ 14 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన 97 సీట్లలో మూడు, నాలుగు, అయిదు, ఆరో స్థానాల్లో ఉంది.