Telangana New DGP Ravi Gupta (PIC@ X)

Hyderabad, December 03: తెలంగాణకు కొత్త డీజీపీ (New DGP) వచ్చారు. రవి గుప్తా నూతన డీజీపీగా (Ravi Gupta) నియమితులయ్యారు. రవి గుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా(DG) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవి గుప్తా హోం ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. కాగా, డీజీపీ అంజనీ కుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రవి గుప్తా వచ్చారు.

 

రేవంత్ రెడ్డిని (Revanth Reddy) అంజనీ కుమార్ కలవడం పట్ల ఈసీ సీరియస్ అయ్యింది. వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది. ఎన్నికల ఫలితాల విడుదల మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించిన ఎన్నికల సంఘం.. అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డిని కలిసిన కాసేపటికే ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకుంది.

Telangana  Election Results 2023: ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు, రేవంత్ రెడ్డితో భేటీ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వీడియో ఇదిగో.. 

మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో రేవంత్ రెడ్డి ఇంటికి అంజనీ కుమార్ వెళ్లారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

వాస్తవానికి శాంతిభద్రతలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రాజకీయ నేతలను కలవడం కామన్. అయితే ఈరోజు అంజనీ కుమార్ తీరు ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను (Anjani Kumar) సస్పెండ్‌ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో డీజీపీ అంజనీకుమార్‌, ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌కుమార్‌ జైన్‌, మహేశ్‌భగవత్‌.. రేవంత్‌ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో రేవంత్‌ రెడ్డిని కలవడాన్ని ఈసీ తప్పు పట్టింది. వెంటనే డీజీపీని సస్పెండ్‌ చేసింది. ఇద్దరు అదనపు డీజీలకు నోటీసులు జారీ చేసింది. అంజనీ కుమార్ స్థానంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు అంజనీకుమార్‌ తర్వాత సీనియర్‌ అధికారిగా ఉన్న రవిగుప్తా.. డీజీపీగా బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.