TS Monsoon Session 2021: పెట్టుబడులను రుణంగా చూడొద్దన్న మంత్రి కేటీఆర్, గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామన్న మంత్రి తలసాని, రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Telangana Assembly Monsoon Session 2021) ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని రోడ్ల పరిస్థితులపై సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో రోడ్లు, పైవంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ( Minister KTR) సమాధానమిచ్చారు.

Hyd, Sep 27: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Telangana Assembly Monsoon Session 2021) ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని రోడ్ల పరిస్థితులపై సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో రోడ్లు, పైవంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ( Minister KTR) సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని.. దాన్ని రుణంగా చూడొద్దన్నారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తగ్గించే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో 22 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తి చేసుకున్నామన్నారు. 24 లింక్‌రోడ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి రూ.5,900 కోట్ల రుణం తీసుకున్నామన్న కేటీఆర్.. వాటిని భవిష్యత్తుకు పెట్టుబడులగానే చూడాలని సూచించారు. కొత్త రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి జరుగుతుందని.. ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఎస్‌ఆర్‌డీపీ రెండో దశ ప్రణాళికలు పూర్తి అయ్యాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జనపనార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మూడు కంపెనీలు కలిపి రూ. 887 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. 10,480 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వరంగల్ జిల్లాలో గ్లాస్టర్ లిమిటెడ్ అనే కంపెనీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంబీజీ కమాటెడిస్ అనే కంపెనీ, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం అగ్రో కంపెనీ జనపనార మిల్లులను ఏర్పాటు చేస్తున్నాయి. జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకం కల్పిస్తున్నది. రెండు వరి పంటల మధ్యన మూడో పంటగా జనుము పంటను పండిచేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పిస్తుందని తెలిపారు.
వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం సులభమేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే దీనికోసం నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ గంగాధర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం పోత్సహిస్తున్నదని చెప్పారు. అయితే దీనికి ఈఆర్సీ నిర్ణయిస్తున్న రేట్లు ప్రతిబంధకాలుగా మారాయన్నారు. విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించిన ధరలకు పొసగడం లేదని తెలిపారు.
పురపాలక సంఘాల్లో వ్యర్థాల నుంచి 38.40 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. వ్యర్థలతో రోజుకు 0.38 మెగాయూనిట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. తద్వారాసంవత్సరానికి 3 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను నివారించగలుగుతున్నామని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటుచేశామన్నారు. కొత్తగా 90.05 మెఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టులకు దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు 76 మెఘావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు అనుమతించామని తెలిపారు.
రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గొర్రెల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి దశలో 3, 80,878 గొర్రెల యూనిట్లను పంపినీ చేశాం. రెండో దశలో 3 లక్షల 50వేల గొర్రెల యూనిట్లను ఇవ్వడానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీని నిమిత్తం రూ. 4,780 కోట్ల 44 వేల రూపాయాలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 191 లక్షల గొర్రెలు ఉన్నాయన్నారు. కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి ఏపీలో కులవృత్తులను ఎవరూ పట్టించుకోలేదు.
బడుగు, బలహీన వర్గాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ కొత్త కార్యక్రమాలు చేపట్టారు. గొర్రెల పంపిణీతో పాటు వాటికి ఇన్సూరెన్స్ కూడా కల్పించాం. గొల్లకురుమలు ఆర్థికంగా ఎదిగారు. రూ. 10 కోట్ల సంపదను సృష్టించారు. మనం గొర్రెలను పంపిణీ చేసిన తర్వాత ఒక కోటి 30 లక్షల గొర్రె పిల్లలు వచ్చాయి. మూగజీవాలకు మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ ఇండియాలోనే ప్రథమస్థానంలో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన మాదిరిగానే బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. భారతదేశంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. వందల రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు.
విద్యతో పాటు బీసీ కులాలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆర్థిక వనరులపై సీఎం దృష్టి సారించారు. బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పరిశీలన చేస్తామన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. జిల్లాల వారీగా రిజర్వేషన్లు కల్పించి, నిష్పక్షపాతంగా కేటాయింపులు చేస్తామన్నారు. గౌడ కులస్తులను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)