Hyderabad, Sep 20: కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్ వైట్ ఛాలెంజ్ (white challenge) పేరిట మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సవాలు విసిరారు. తాను పరీక్షలకు సిద్ధమని.. రాహుల్ గాంధీ రెడీనా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్ సోమవారం ట్విటర్ వేదికగా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు.
‘‘ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏ రకమైన పరీక్షకైనా నేను సిద్ధమే.. రాహుల్ వస్తాడా. చర్లపల్లి బ్యాచ్‌తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది. నాకు క్లీన్‌చిట్ వస్తే పదవికి రాజీనామా చేసి రేవంత్ క్షమాపణ చెప్తాడా.. ఓటుకు నోట్ల కేసులో లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా’’ అని కేటీఆర్ (Minisater KTR) ప్రశ్నించారు.ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. తాను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. మాతో పాటు కేసీఆర్ కూడా లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. సహారా, ఈఎస్‌ఐ కుంభకోణాలు, సీబీఐ కేసులలో వీరు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు.
కాగా, తనపై రేవంత్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి కేటీఆర్ హైకోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ‘‘నాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేశాను. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాను. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేరస్థులకు తగిన శిక్ష పడాలి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తమ గురించి మాట్లాడితే రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ బెదిరిస్తున్నారని.. అయినా భయపడేదే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుల గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఎలాంటి చర్చ జరుగుతోందో ముందు ఆయన తెలుసుకోవాలని సూచించారు. చట్టాలు కేటీఆర్‌కు చుట్టాలు కావని, కేసులు పెడితే ఏం చేయాలో తమకూ తెలుసునని చెప్పారు.