Hyderabad, Sep 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సమితి (ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. మొన్న ఆర్టీసీ బస్సు, బస్టాండ్‌లో సాధారణ వ్యక్తిలా ప్రయాణించి క్షేత్రస్థాయిలో ఆర్టీసీ సేవలను పరిశీలించిన సంగతి విదితమే. తాజాగా గణేశ్ నిమజ్జనం (immersion of Ganesh idols) సందర్భంగా ఆర్టీసీ బస్సులోనే వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుటుంబసభ్యులతో కలిసి సజ్జనార్ వినాయకుడి ప్రతిమను తీసుకుని బస్సులో బయల్దేరారు. ఈ సందర్భంగా సజ్జనార్ తెలుపు దుస్తులు ధరించి తలపై టోపీ పెట్టుకుని మహారాష్ట్ర లుక్‌లో కనిపించారు. వినాయక విగ్రహంతో బస్సులో కూర్చుని ఉండగా భక్తులు నినాదాలు చేస్తున్నారు. కొందరు ఉత్సాహంగా డ్యాన్స్‌లు కూడా చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సంస్థ బాగు కోసం సజ్జనార్ చేస్తున్న ప్రయత్నాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని నెటిజన్లు అభినందిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో ఆర్టీసీకి పూర్వ వైభవం వస్తుందని, ఆర్టీసీ లాభాల బాట పడుతుందని పేర్కొన్నారు.
@tsrtcmdoffice #VCSajjanar గారు తన కుటుంబ సభ్యులతో కలిసి గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ చేరుకోవడానికి ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించారు.#Ganeshimmersion pic.twitter.com/BBrjybN7Z5
— Khwaja Moinuddin (@khwajamoinddin) September 19, 2021
పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగింది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై తుదిపూజల అనంతరం మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేశారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా, లాల్ దర్వాజ, చాంద్రాయణగుట్ట, యాఖత్ పురా, బహదూర్ పురా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్ పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. చిరుజల్లుల మధ్య గణేశ్ శోభయాత్ర కొనసాగుతోంది. ఇవాళ భాగ్యనగరంలో పెద్ద ఎత్తున గణేశుడి నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో వర్షంలోనే గణనాథులు ఊరేగింపు సాగుతోంది.