Ganesh Visarjan 2021: సీఎం జగన్ కోసం.. రూ.18.90 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి, హైదరాబాద్‌లో వైభవంగా కొనసాగుతున్న గణేశుడి మహా శోభాయాత్ర
Ganesh Visarjan 2021 (Photo-Twitter)

Hyderabad, Sep 19: గణేశుడి మహా శోభాయాత్రకు మహానగరం సిద్ధమైంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(GHMC) పోలీసు, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు సంస్థ, జలమండలి ఇలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించి ఏర్పాట్లు పూర్తి చేశాయి. హుస్సేన్‌సాగర్‌తోపాటు అతిపెద్ద 25 చెరువులు, 25 నిమజ్జన కోనేరుల్లో ఈ కార్యక్రమం (Ganesh Visarjan 2021) సాగుతుందని అధికారులు ప్రకటించారు. శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్‌ నియంత్రిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, బల్దియా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం నిమజ్జన ప్రక్రియన దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఏరియల్‌ సర్వే కోసం హెలికాప్టర్‌ కూడా వాడుతున్నారు. హస్సేన్‌సాగర్‌తోపాటు సరూర్‌నగర్‌, సఫిల్‌గూడ, ఐడీఎల్‌ లాంటి ప్రధాన చెరువుల దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 24 గంటలపాటు నిర్వహించే శోభాయాత్రకు అనుగుణంగా అన్ని ఏరియాల నుంచి విగ్రహాలను నిమజ్జనం (Ganesh idol immersion) జరిగే చోటకు పంపించడానికి పోలీసు స్టేషన్ల వారీగా ప్రణాళికను రూపొందించారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిద్దాం : సీపీ అంజనీకుమార్

నిమజ్జనం సాఫీగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని సీపీ అంజనీకుమార్‌ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సోమవారం 5 గంటల్లోపు నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. శోభాయాత్ర సాఫీగా కొనసాగేందుకు బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకూ ఉన్న 17 కిలోమీటర్ల ప్రధాన ఊరేగింపు మార్గంలో 276 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలను విధించామని తెలిపారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకూ కొనసాగనున్న గణేశ్‌ శోభాయాత్రను గూగుల్‌ మ్యాప్స్‌కు అనుసంధానించారు. దీంతో శోభాయాత్ర గమనాన్ని నెటిజన్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు.

గణేష్‌ విగ్రహాలతో ఉత్సాహంగా రండి : రాచకొండ సీపీ

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో 24 ప్రాంతాల్లో నిమజ్జనం జరుగనుంది. గణేష్‌ విగ్రహాలతో ఉత్సాహంగా రండి.. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యాక సురక్షితంగా ఇళ్లకువెళ్లండి. సరూర్‌నగర్‌, సఫిల్‌గూడ చెరువులు సహా మిగిలిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిమజ్జనం చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం.

వాహనాలపై డీజేలను తీసుకురావద్ధు: సైబరాబాద్‌ సీపీ ఎం.స్టీఫెన్‌ రవీంద్ర

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా చెరువుల వద్ద రక్షణ ఏర్పాట్లు చేశాం. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చి కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించాం. ప్రతిమలను నిమజ్జనం చేసేందుకు వచ్చేవారు వాహనాలపై డీజేలను తీసుకురావద్ధు ఊరేగింపులను చిత్రీకరించేందుకు డ్రోన్లను వినియోగించకూడదు. చూసేందుకు నిర్వాహకులతోపాటు వచ్చే మహిళలు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.

ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన ప్రాంతాలు

చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, మొజంజాహీ మార్కెట్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌ లిబర్టీ, హుస్సేన్‌ సాగర్‌ వరకూ ఉన్న మార్గంలో విగ్రహాలు తీసుకొస్తున్న వాహనాలు మినహా ఇతర వాహనాలు అటూ, ఇటూ వెళ్లేందుకు అనుమతి లేదు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సమీపంలోని బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ కింద మాత్రమే వాహనాలు, ప్రజలను అటూ, ఇటూ అనుమతించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు మినహాయింపు ఇస్తున్నారు.

హైదరాబాద్‌లో 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, గణేష్ నిమజ్జనానికి ముస్తాబైన ట్యాంక్‌బండ్, ట్రాఫిక్‌ ఆంక్షల పూర్తి సమాచారం తెలుసుకుందాం

ఇతర రాష్ట్రాల బస్సులు, జిల్లాల బస్సులు ఆదివారం ఉదయం 10గంటలోపు మాత్రమే ఇమ్లీబన్‌ బస్టాండ్‌కు చేరుకోవాలి. తర్వాత ఆయా వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. భారీ వాహనాలు, సరకు రవాణా వాహనాలకు నగర రహదారులపై అనుమతి లేదు. ప్రైవేటు బస్సులు కూడా సోమవారం ఉదయం 10గంటల వరకు నగరంలో ప్రవేశించకూడదు. విమానాశ్రయానికి వెళ్లేవారు బాహ్యవలయ రహదారిని వినియోగించుకోవాలి.

ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యే ప్రాంతాలు

కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్‌ సర్కిల్‌

* సికింద్రాబాద్‌ నుంచి వచ్చే బస్సులు సీటీవో, ఎస్‌బీహెచ్‌, క్లాక్‌ టవర్‌, చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌

* ఉప్పల్‌ నుంచి వచ్చే బస్సులు రామంతాపూర్‌ టీవీ స్టేషన్‌

* దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే బస్సులు గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్‌

* రాజేంద్రనగర్‌ నుంచి వచ్చే బస్సులు దానమ్మ హట్స్‌

* ఇబ్రహీంపట్నం, మిధాని నుంచి వచ్చే బస్సులు ఐ.ఎస్‌.సదన్‌

* ఇంటర్‌ సిటీ ప్రత్యేక బస్సులు వైఎంసీఏ నారాయణగూడ, జమై ఉస్మానియా వైపు వెళ్లే బస్సులు తార్నాక కూడలి వరకే వెళ్తాయి.

* బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకూ ప్రధాన శోభాయాత్ర

సందర్శకుల పార్కింగ్ ప్రాంతాలు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఖైరతాబాద్‌, * ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఖైరతాబాద్‌, * ఆనంద్‌ నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం, ఖైరతాబాద్‌, * బుద్ధభవన్‌ వెనుకవైపు, సికింద్రాబాద్‌, * గోసేవా సదన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, * కట్టమైసమ్మ దేవాలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ●* ఎన్టీఆర్‌ స్డేడియం, * నిజాం కళాశాల, బషీర్‌బాగ్‌, * పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి.

అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు

ఉత్సవాలకు చూసేందుకు తరలొచ్చే పర్యాటకుల కోసం రైల్వే, మెట్రో, ఆర్టీసీ యంత్రాంగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకులతో పాటు ఇతర ప్రాంతాలకూ నడిచే మెట్రో సర్వీసుల సమయాన్ని అర్ధరాత్రి ఒంటి గంట వరకూ పెంచనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలయ్యే మెట్రో సర్వీసు చివరి స్టేషన్‌కు 2గంటలకు చేరుకోనుంది. 8 ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసుల్ని అదనంగా నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించగా 565 అదనపు బస్సుల్ని నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయత్ర

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయత్ర వైభవంగా జరుగుతోంది. భారీ ట్రాలీపై గణేశుడి ఊరేగింపు సందడిగా సాగుతోంది. ఊరేగింపు రథంపై గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. మహా గణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిమజ్జనోత్సవాల్లో భాగంగా జీహెచ్ఎంసీ భక్తులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తోంది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి మహాగణపతిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం జరగనుంది.

రికార్డు ధర పలికిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్‌ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు 2019లో బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు. ఆ సమయంలో రూ.17.60 లక్షలకు రాంరెడ్డి లడ్డూరు దక్కించుకున్నారు.

వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి. 1994 నుంచి బాలాపూర్‌ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా గతేడాది వేలంపాట జరగని విషయం తెలిసిందే. మరోవైపు భజన బృందం, డప్పు చప్పుళ్ల సందడి నడుమ ఊరేగింపు వైభవంగా సాగుతోంది. బాలాపూర్‌ ప్రధాన వీధుల్లో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని బాలాపూర్‌ లడ్డూ వేలంలో పాల్గొన్నా. శశాంక్‌రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నా. సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నా అని ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ అన్నారు.