Telangana Govt Jobs: ఉద్యోగ ఖాళీల వివరాలపై అస్పష్టత, ఐదు రోజుల్లో పూర్తి వివరాలు అందజేయాలని అధికారులకు తెలంగాణ కేబినేట్ ఆదేశం, జిల్లాల వారీగా సంఖ్య చూపించాలని సూచన

హోం శాఖలో అత్యధికంగా 21,500 పోస్టులు ఉన్నాయి, ఆ తరువాత వైద్య, ఆరోగ్య శాఖలో 10,000 మరియు ఉన్నత విద్యలో 3,800 ఖాళీలతో ఉన్నాయి...

Representational Image (Photo Credits: PTI)

Hyderabad, July 15: వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగుల వివరాలు, ఖాళీల వివరాలపై ఆయా శాఖల అధికారులు నివేదించిన వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని తెలంగాణ కేబినెట్ అభిప్రాయపడింది. ప్రతి విభాగంలో మంజూరీ అయిఉన్న పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలతో పాటు ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అధికారులు సమర్పించారు. అయితే, కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను, అధికారులను కేబినెట్ ఆదేశించింది.

రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా ఈ మధ్యనే తెలంగాణకు తెచ్చుకున్నామని కేబినెట్ తెలిపింది. ఇంకా కూడా మిగిలిపోయిన 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రా నుంచి తీసుకురాబోతున్నామన్నది. ఈ అన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రా నుంచి వచ్చే ఉద్యోగులందరినీ కలుపుకుని ఇంకా మిగిలిఉన్న ఖాళీలను సత్వరమే గుర్తించి కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందచేయాలని, మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.

అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లా వారీగా, విభాగాల వారీగా సంకలనం చేయాలని కేబినెట్ ఆదేశించింది.

ప్రస్థుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అన్ని విభాగాలనుంచి 5 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.

ఇక, అధికారులు నివేదించిన 28 విభాగాలలో 56,979 ఖాళీలను భర్తీ చేయడానికి కేబినెట్ ఆమోదించింది. హోం శాఖలో అత్యధికంగా 21,507 పోస్టులు ఉన్నాయి, ఆ తరువాత వైద్య, ఆరోగ్య శాఖలో 10,048 మరియు ఉన్నత విద్యలో 3,825 ఖాళీలతో ఉన్నాయి.