CM KCR Speech in Patancheru: మళ్లీ గెలిపిస్తే పటాన్‌చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, భూముల ధరలపై చంద్రబాబుకు చురకలు
పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
Patancheruvu, June 22: పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు.
24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు. పటాన్‌చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రావాలని చెప్పిన సీఎం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే కచ్చితంగా మెట్రో వస్తుందని అన్నారు. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. ఇక్కడికి త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో పొడిగిస్తామని తెలిపారు. పటాన్‌చెరులో పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసినట్లు చెప్పారు. పటాన్‌చెరులో మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడస్తున్నాయన్నారు.
వీడియో ఇదిగో, మన శత్రువులు అంటూ చంద్రబాబుపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
భూముల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిస్థితి తారుమారైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణలో భూములు ధరలు పెరగగా.. ఏపీలో తగ్గాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లుగా తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఆంధ్రాకు వెళ్లి వందెకరాలు కొనుగోలు చేయవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు.
‘ఒక్కటే మాట మనవి చేస్తున్నా. మోసపోతే.. గోసపడుతాం. ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నమో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరంగా ముందుకెళ్తున్నాం. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాం. కేసీఆర్ కిట్ ఎలా ఉంటుందో చూశారు. హరీశ్‌రావు ఆరోగ్యమంత్రిగా వచ్చాక వైద్యరంగం కొత్త పరుగులు పెడుతున్నది. కేసీఆర్ కిట్ కాదు.. మహిళలు గర్భిణులగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్‌ను తీసుకువచ్చారు.
వైద్య ఆరోగ్య రంగంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసు. హైదరాబాద్‌కు వెళ్లే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తప్ప మరొకటి లేకుంటే. అద్భుతమైన ఐదు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు తీసుకువస్తున్నాం. ప్రభుత్వరంగంలోనే 17వేల బెడ్స్ ఉంటే.. ప్రస్తుతం 50వేల బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా పత్రి బెడ్‌కు ఆక్సిజన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. దగ్గరలోని ఇస్నాపూర్‌లోనే 500 టన్నుల ఆక్సిజన్ తయారుచేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ఎవరినో అడుగకుండా మన ఆక్సిజన్ మనమే తీసుకునే విధంగా పెట్టుకున్నాం. కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్లీ ముందు కొనసాగాలంటే.. నిన్నా మొన్న 20 రోజుల నుంచి కార్యక్రమాలు చేశారో.. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని దీవించినట్లయితే బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసుకుందాం.
కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకెళ్దాం. ఈ రాష్ట్రం ఇంత త్వరలో ఇంత బాగైతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఏర్పడకూడదని అని మాట్లాడినటువంటి పెద్దలే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారెకరాలు కొనుక్కుందుము.. ఇప్పుడు తెలంగాణలో ఒకరం అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుకుంటున్నరని చంద్రబాబు నాయుడే చెప్పారు. అంటే విషయం తారుమారైంది.. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమే. తెలంగాణ భూములు ఎలా పెరిగాయో తెలుసు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లావారిని సమైక్య శక్తులు కన్ఫ్యూజ్ చేశాయి. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పారు.
కానీ, పటాన్‌చెరువులో ఇవాళ ఎకరం భూమి ధరం ఎంత? ఆ రోజు ఎంత ఉండే? ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతున్నది. రూ.30కోట్లు పలికితే చంద్రబాబు అన్నట్లుగా ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చు. ఇంకా నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుంది. మనకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంది కాబట్టి.. ప్రజలను మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి ముందుకెళ్తున్నాం. తెలంగాణ అమరవీరులను స్మరించుకోవాలి. జీవితాలను అర్పించడం కంటే గొప్పత్యాగం మరొకటి ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను ధారబోసి త్యాగాలు చేశారు కాబట్టి.. దశాబ్ది ఉత్సవాల ముగింపులో వారందరినీ తలచుకోవడం మనందరి కర్తవ్యం’ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)