COVID Review: కరోనా చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించుకోవాలని సీఎం కేసీఆర్ సూచన, తెలంగాణలో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం
కరోనా వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో పూర్తిగా ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం కోరారు...
Hyderabad, May 18: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ
కరోనా వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో పూర్తిగా ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం కోరారు. సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్ బెడ్స్ 2,253, ఐసీయూ 533, జనరల్ బెడ్స్ 4,140 ఖాళీ ఉన్నాయని సీఎం వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడెసివిర్ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నందున ప్రైవేటు హాస్పిటల్స్ ను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. వైద్యం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా ఒక్కటే అయినందున కోవిడ్ చికిత్సకు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం ప్రజలను కోరారు.
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 200 పడకల ఆసుపత్రిని తక్షణమే కోవిడ్ చికిత్సకు ఉపయోగించాలని, సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్ఎఫ్, సీఆర్.పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులను కోవిడ్ సేవలు అందించడానికి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి సోకుతున్నదని, దానికి సంబంధించి చికిత్స అందించడం కోసం కోఠిలోని ఈ.ఎన్.టి, సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రుల్లో, జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో ఎక్విప్ మెంట్, అవసరమైన మందులు సమకూర్చాలని సీఎం అధికారులను కోరారు.
కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సినేషన్ కోటా విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తెప్పించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్ మాత్రమే వచ్చిందని, కోవాక్సిన్, కోవిషీల్డ్ కలిపి ప్రస్తుతం 1,86,780 డోసులు స్టాకు ఉందని అధికారులు సీఎం కు తెలిపారు. అందులో కోవాక్సిన్ 58,230, మరియు కోవిషీల్డ్ 1,28,550 డోసులు స్టాకు ఉందని ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు లాక్ డౌన్, జ్వర సర్వే, కోవిడ్ కిట్ల పంపిణీ తదితర కారణాల వల్ల కోవిడ్ అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జిలు పెరగడం సంతోషకరమని సీఎం అన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్న వారి శాతం మెరుగ్గా ఉండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి అన్నారు. జ్వర సర్వేలో లక్షణాలు గుర్తించిన వారిని వైద్య బృందాలు నిరంతరం సంప్రదిస్తూ, కనిపెట్టుకుంటూ ఉండాలని సీఎం సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బెడ్లు కేటాయించే విషయంతోపాటు, నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే ప్రభుత్వం జీవో నంబర్ 248 విడుదల చేసిందని అన్నారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇదే తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషంట్లే తమ బిల్లులు చెల్లిస్తున్నట్లు తమ పరిశీలనలో తెలిసిందని అధికారులు వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు త్వరితగతిన మందులు అందించడం కోసం కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వీటిని సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల కేంద్రాల్లో మందులు తదితర మౌలిక వసతుల రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ రీజినల్ సబ్ సెంటర్ల పరిధిలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి అద్దె లేదా సొంత ప్రాతిపదికన వాహనాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, మందులు నిల్వ చేయడానికి సబ్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిజన్ సరఫరాలో పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత అనేది ఉత్పన్నం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
మొత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ లలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు వచ్చన నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సీఎం సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సీఎం అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)