Paddy Procurement: కరోనా దృష్ట్యా రైతులు సాగుచేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా 6,408 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నందున కార్పొరేషన్ కు లీజుకు ఇవ్వడానికి....

Telangana CM KCR | File Photo.

Hyderabad, March 30: రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు.

ప్రగతి భవన్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు అవసరమైన 20,000 కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. హైదరాబాద్ లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రిని, సీఎస్ ను, అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాల్లో 2,131 ఐకేపీ కేంద్రాలు, 3,964 పీ.ఏ.సీ.ఎస్. కేంద్రాలు, మిగతావి మరో 313 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు.

రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే విషయంలో కనీస మద్దతు ధర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. వడ్లు ఎండబోసి తాలు లేకుండా 17శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. తేమ ఎక్కువగా లేకుండా చూసుకోవాలని, కనీస మద్దతు ధర పొందేందుకు అనుసరించాల్సిన నిబంధనలను పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని, దాదాపు 1 కోటి 17 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం వివరించారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నందున కార్పొరేషన్ కు లీజుకు ఇవ్వడానికి స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, పత్తి మంచి క్వాలిటీ ఉండటంతోపాటు ఎక్కువ దిగుబడి వచ్చి అధిక ధర లభించే అవకాశం ఉన్నందున, వచ్చే వానాకాలం 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం రైతులను కోరారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని సీఎం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు. అలాగే, 20 నుండి 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని సీఎం తెలిపారు. వేరుశనగ, ఆయిల్ పామ్ సాగు కూడా బాగా లాభదాయకంగా ఉందని వాటి సాగు మీద రైతులు దృష్టి సారించాలని సీఎం రైతులను కోరారు.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్