Land Grab Charges Against Etela: క్లైమాక్స్‌కు ఈటల ఎపిసోడ్, విజిలెన్స్ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల రాజేందర్ తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపించారు.
Hyderabad, May 1: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ భారీ భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు (Land Grab Charges against Etela) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల రాజేందర్ తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపించారు. అచ్చంపేట, హకీంపేట ప్రాంతంలో సుమారు 100 ఎకరాల భూమిని ఈటెల కబ్జా చేశారని వారు తెలిపారు. జమున హ్యాచరీస్ కోసం తమ భూములను మంత్రి ఈటెల (Health Minister Eatala Rajender) లాక్కున్నారని వెల్లడించారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచంపేట్ అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ఈ విషయం మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.అనంతరం ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana Chief Minister K Chandrashekhar Rao) విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చాలని, మెదక్ కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక తెప్పించాలని సీఎస్‌ను ఆదేశించారు.ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని విజి లెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్‌రావుకు బాధ్యత అప్పగించారు. వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలన్నారు.
రైతుల లేఖలో ఏముంది ?
రైతులు రాసిన లేఖ ప్రకారం.. 1994లో బడుగు బలహీన వర్గాలకు సాయం కింద ప్రభుత్వం సర్వే నంబర్లు 130/5, 130/9, 130/10లలో.. చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి పరశురాం, చాకలి నాగులు అనే వ్యక్తులకు ఒకటిన్నర ఎకరాల చొప్పున అసైన్ చేసిందని లేఖలో వివరించారు. సర్వే నంబర్ 130/2లో ఎరుకల దుర్గయ్య, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు అనే వ్యక్తుల పేరిట మూడెకరాలు అసైన్ చేసినట్టు తెలిపారు.
తమకు చెందిన ఈ భూములను మంత్రి ఈటెల రాజేందర్, ఆయన అనుచరులు సూరి అలియాస్ సుదర్శన్, యంజాల సుధాకర్‌రెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారని లేఖలో రైతులు ఆరోపించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని భయపెట్టారని.. తమతోపాటు వంద మంది పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి అసైన్డ్ సర్టిఫికెట్లను దౌర్జన్యంగా లాక్కున్నారని పేర్కొన్నారు.
మంత్రి ఈటల, ఆయన అనుచరులు రెండు గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో రైతులు ఆరోపించారు. ఆ భూముల్లో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. వారికి అడ్డుపడుతున్న రైతులను బెదిరిస్తున్నారని, తమ పొలాలకు వెళ్లే దారి మూసేసి ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. భూములను తమకు అమ్మేయాలని, లేకుంటే శాశ్వతంగా దారిలేకుండా చూస్తామని బెదిరిస్తున్నారని లేఖలో రైతులు పేర్కొన్నారు.
అచ్చంపేట, హకీంపేట అసైన్డ్ భూములకు సంబంధించి గతంలో మంత్రి తమపై ఒత్తిడి తెచ్చారని మెదక్ మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. అక్కడ ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ఈటలకు సంబంధించినదే అయిఉంటుందన్నారు. గతంలో బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తమకు కేటాయిస్తే పౌల్ట్రీ హేచరీకి ఉపయోగపడుతాయంటూ.. మంత్రి అనుచరులు తన వద్దకు వచ్చారని, గతంలో మెదక్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన నగేశ్ చెప్పారు. ఎంత ఒత్తిడి వచ్చినా.. అసైనీలకు తప్ప వేరొకరికి భూములు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పామన్నారు. భూములపై అసైనీలు తమకు ఫిర్యాదు చేశారని.. పొజిషన్‌లోకి వెళ్లి, భూములను వినియోగించుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు.
ఈటెల దీనిపై ఏమంటున్నారు ?
మెదక్ జిల్లాలో అసైన్డ్ భూములు కబ్జా (illegal land scam) చేసినట్టుగా వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, కావాలనే స్కెచ్ వేసి తనపై తప్పుడు ప్రచారం చేశారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి షామీర్‌పేటలోని తన ఇంట్లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ‘‘స్కూటర్‌పై తిరిగిన వాళ్లు వేల కోట్లకు ఎదిగారు. ఒక్క సిట్టింగ్‌లోనే వందలు, వేల కోట్లు సంపాదించే వారు ఎందరో ఉన్నారు.
వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చినయ్. నేను నిప్పులాంటి వ్యక్తిని. నా చరిత్ర మీద, ఆస్తులపై విచారణ చేయండి. తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే. సీఎస్, విజిలెన్స్ డీజీతో విచారణ చేయించడానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. వారితోనే కాదు.. సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించి నిజానిజాలు సమాజానికి చెప్పాలి..’’ అని డిమాండ్ చేశారు.
తాను ఏమీ లేని నాడు కొట్లాడానని, ప్రలోభాలకు గురి చేయాలని చూసినా కొట్లాడానని.. ప్రజల కోసం కొట్లాడటమే తప్ప వెన్నుపోటు తెలియదని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోపణలు వచ్చిన భూముల్లో తనకు ఒక్క ఎకరం ఉన్నా షెడ్లు కూలగొట్టి తీసుకోవాలన్నారు. ‘‘రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో ఎన్నో కోట్ల రాయితీలు ఇచ్చారు. నేను ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా తీసుకోలేదు. చిల్లరమల్లర ప్రచారాలకు, కుట్రకు లొంగిపోయే వ్యక్తిని కాదు. నేను ముదిరాజ్ బిడ్డను. చావనైనా చస్తా తప్ప మాట తప్పే మనిషిని కాదు. నన్ను దొర అనడం నీచం. అణచివేతలకు, దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తిని నేను’’ అని ఈటల పేర్కొన్నారు.
తాను 1986 నుంచీ పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నానని.. 2007లో ఐదు కోట్లు పెట్టి 2,100 గజాల భూమి కొంటే వివాదంలో పడిందని, ఇప్పటికీ తనకు రాలేదని చెప్పారు. కానీ తన వ్యక్తిత్వాన్ని నాశనం చేసేలా కొందరు విషం చల్లే ప్రచారం చేశారని ఆరోపించారు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినా.. అంతిమంగా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
2016లో జమున హేచరీస్ పేరుతో అచ్చంపల్లి, హకీంపేట గ్రామాల్లో రూ.6లక్షల చొప్పున 40 ఎకరాల భూమి కొని షెడ్లు వేశామని.. తర్వాత ఇంకో ఏడెకరాలు కొనుక్కున్నామని మంత్రి ఈటల చెప్పారు. కెనరా బ్యాంకులో రూ.100 కోట్లు రుణం తీసుకున్నామని, ఆ అప్పు ఇంకా కడుతూనే ఉన్నామని తెలిపారు. ‘‘పౌల్ట్రీ కోసం మరింత భూమి కావాల్సి వచ్చింది.
కానీ మా చుట్టుపక్కల అన్నీ అసైన్డ్ భూములున్నాయి. అప్పుడు పరిశ్రమల శాఖకు అప్లికేషన్ పెడితే.. ఇవ్వలేమని చెప్పారు. టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శితో దీనిపై మాట్లాడాను. రాళ్లురప్పలతో కూడిన భూమి అది. 1994లో అసైన్ చేస్తే ఇప్పటికీ ఒక్క ఎకరం కూడా సాగు కాలేదు.
ఆ భూములను ప్రభుత్వం సేకరించి ఇవ్వాలంటే ఆలస్యం అవుతుందని అధికారులు చెప్పారు. అసైనీలు ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగిస్తే.. తొందరగా తీసుకోవచ్చన్నారు. అప్పుడు రైతులతో మాట్లాడి 20–25 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేశాం. కానీ తర్వాత మా హేచరీస్ విస్తరణ ఆలోచనను పక్కనపెట్టేశాం. ఇప్పటికీ ఆ భూములు వాళ్ల దగ్గరే ఉన్నాయి.
ఎమ్మార్వో దగ్గరే కాగితాలున్నాయి. నేను భూములు ఆక్రమించుకున్నానన్న ఆరోపణలు నీచం. 2004 నాటికే రాష్ట్రంలో 10.50 లక్షల కోళ్లున్న పౌల్ట్రీకి ఎదిగిన వాడిని. ఆరు లక్షల లేయర్, 4.5 లక్షల బ్రాయిలర్ కోళ్లు ఉండేవి. 2004 అఫిడవిట్లోనే నా ఆస్తులన్నీ చూపించా. ఒక్క తరంలోనే రూ.వందల కోట్లకు ఎదిగిన వాళ్లు ఉన్నారు. వాళ్లను ఎందుకు అడగరు?’’ అని ఈటెల ప్రశ్నించారు.
ఇష్యూపై సెలైంట్ గా ఉండాలని కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు అధిష్టానం ఆదేశాలు
మంత్రి ఈటల రాజేందర్ ఇష్యూపై కామెంట్స్ చేయొద్దని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా ఫోన్‌లో ఈ టాపిక్‌పై అస్సలు స్పందించొద్దని అధిష్టానం చెప్పింది. అయితే ఈటల వ్యవహారంపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన నేతలు పలువురు స్పందించారు.
మంత్రి ఈటల.. కష్టపడి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నారని... మొదటి నుంచి ఆయన కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాక ముందే వందల ఎకరాల భూములు, ఆస్తులు, కోళ్ల ఫామ్‌లు ఉన్నాయన్నారు. కావాలనే ముఖ్యమంత్రి, కేసీఆర్ కుటుంబం ఈటలపై నిందలు మోపుతోందని ఆరోపించారు. ఈటలపై మోపిన నిందలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హుజూరాబాద్‌కు చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రంగంలోకి దిగిన విజిలెన్స్
ఇక మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో మంత్రి ఈటల రాజేందర్ భూ వివాదంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ సీఐ సతీష్ విచారణకు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసుల మోహరించారు. పొరుగు జిల్లాల నుంచి గ్రామానికి బలగాలు చేరుకుంటున్నాయి. అచ్చంపేటలో తుప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. తుప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ నేతృత్వంలో మంత్రి ఈట ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు శామీర్‌పేటలోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే అచ్చంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన స్వగ్రామం కమలాపూర్‌లో అడుగడుగునా భారీగా పోలీసులు మోహరించారు. కాగా ఈటెలపై వేటువేసే ఉద్దేశ్యంతోనే పోలీసులు మోహరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈటల రాజేందర్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈటలకు అన్యాయం జరిగితే చూస్తూ సహించేది లేదని అభిమానులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే మెదక్ జిల్లా మాసాయిపేటలో అసైన్డ్ భూములు ఈటల కబ్జా చేసినట్లుగా వివిధ ఛానళ్లలో వచ్చిన కథనాలపై ట్విట్టర్ వేదికగా తన అభిమానులకు ఈటెల సందేశం పంపించారు. ‘‘హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలి. కరోనా సమయం కాబట్టి ఎవరూ కూడా హైదరాబాద్‌కు రావొద్దు. ఇబ్బందులు పడవద్దు అని విజ్ఞప్తి’’ అంటూ ఈటల విన్నవించారు.