Mana Ooru Mana Badi: తెలంగాణలో మన ఊరు -మన బడి, మార్చి 8న వనపర్తి జిల్లా నుంచి ప్రారంభించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

మన ఊరు -మన బడి (Mana Ooru Mana Badi) కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిప్టును, వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభిస్తారు.

CM KCR atTRS Plenary Meeting (Photo-Video Grab)

Hyd, Mar 1: తెలంగాణ సీఎం కేసీఆర్‌ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు -మన బడి (Mana Ooru Mana Badi) కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిప్టును, వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభిస్తారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ (TRS Party) వనపర్తి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సర్కారు బడుల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) నడుం బిగించింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వనపర్తి జిల్లా (Wanaparthy) నుంచి ప్రారంభించనున్నారు. దేశంలోనే మొదటిసారిగా, ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా.. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కారు ప్రకటించింది.

ఇందుకోసం ఏర్పడిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ మూడేండ్లలో.. మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఆ ప్రతిపాదనలకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 26,065 స్కూళ్లు ఉండగా, తొలి విడతలో 9,123 (35శాతం) బడుల్లో సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ. 7,289 కోట్లను ఖర్చు చేయనుండగా, తొలి విడతలో రూ. 3,497.62 కోట్లను ఖర్చుచేయనున్నారు.

మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, ఈ సారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు

26వేల పైచిలుకు పాఠశాలల్లో మొత్తంగా 19 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, మొదటి విడతలో ఎంపికచేసిన స్కూళ్లల్లోనే 65 శాతం విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫర్నిచర్‌, కిచెన్‌షెడ్లు, అదనపు తరగతి గదులు, డైనింగ్‌హాల్స్‌, మూత్రశాలలు, తాగునీరు, ప్రహరీలు, మరమ్మతులు, గ్రీన్‌చాక్‌పీస్‌ బోర్డులు, పెయింటింగ్‌ వంటి 12 వసతులు కల్పించేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున స్కూళ్లను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికచేసి అభివృద్ధి చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి తొలి విడత అమలుకు రూ. 2,800 కోట్లకు పైగా నిధులను సిద్ధంగా ఉంచింది. ఈ కార్యక్రమం ప్రారంభంకాగానే నెలకు రూ. 150 కోట్ల చొప్పున ఆర్థిక శాఖ విద్యాశాఖకు కేటాయించనుంది. ఆ నిధులను విద్యాశాఖ అధికారులు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలకు (ఎస్‌ఎంసీ) కేటాయిస్తారు. టీసీఎస్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పనులకు అనుమతులిచ్చి, ఆయా అంచనాల ప్రకారం నిధులను మంజూరుచేస్తారు. తొలుత 15 శాతం నిధులను ఎస్‌ఎంసీలకు రివాల్వింగ్‌ ఫండ్‌గా మంజూరుచేసి, ఆయా నిధుల్లో ఎంత ఖర్చుచేస్తే అంత మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తారు.



సంబంధిత వార్తలు