CM Revanth Reddy On Jagan: జగన్ చచ్చిన పాము, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల విషయంలో తాను రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Hyd, June 28: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల విషయంలో తాను రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతో ఢిల్లీలోని తన నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఏపీ కోసం ఎంత నిబద్ధతతో పని చేస్తారో... తెలంగాణ కోసం తానూ అలాగే పని చేస్తానన్నారు. చంద్రబాబు ఏదో చెప్పారని రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడితే ప్రజలు తనను రాజకీయాల్లో క్షమిస్తారా? అని ప్రశ్నించారు. తన ఉద్యోగం కోసమే చంద్రబాబును వదిలి వచ్చానని... అలాంటప్పుడు ఆయన కోసం ఉద్యోగం వదులుకుంటానా? అన్నారు.
హైదరాబాద్‌లోని జగన్ ఇంటిముందు కూల్చివేతల గురించి తనకు ఎవరూ చెప్పలేదన్నారు. దీనిపై ఆరా తీస్తే ఓ నాయకుడు చెబితే అధికారులు అలా చేశారని తెలిసిందని... అందుకే వారిని సరెండర్ చేశామన్నారు. కానీ, చంద్రబాబు చెబితే తాను అలా చేశానని బయట ప్రచారం జరిగిందని... అది అవాస్తవమన్నారు. జగన్ చచ్చిన పాము అని... అలాంటి వ్యక్తి ఇంటి ముందు ఉన్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుందని ప్రశ్నించారు. అసలు తన ప్రధాన ప్రత్యర్థి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందే ఏవేవో కట్టుకున్నారని... వాటినే తీయలేదని... ఇక జగన్‌వి తాను ఎందుకు ముట్టుకుంటానన్నారు. బీఆర్ఎస్‌లో మరో వికెట్ డౌన్, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వీడియో ఇదిగో..
మన సొంత పగలు తీర్చుకోవడానికి ప్రజలు మనకు అధికారాన్ని ఇవ్వలేదనే విషయాన్ని జగన్‌ను చూసి నేర్చుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు జగన్‌కు 151 సీట్లు ఇస్తే పగ తీర్చుకోవడానికి ప్రయత్నించారని... అందుకే ప్రజలు తాజా ఎన్నికల్లో 11 సీట్లకు సరిపెట్టారన్నారు. హైదరాబాద్‌కు అమరావతి పోటీయే కాదన్నారు. హైదరాబాద్‌ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారని తాను భావించడం లేదన్నారు. అమరావతిలో లాభం ఉంటే మనం తాడుతో కట్టేసినా ఆగిపోరన్నారు.
కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని భావించారని... కానీ ఆయనే తుడిచిపెట్టుకుపోయారని మండిపడ్డారు. సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి సమాజానికో... మనుషులకో పనికి వస్తాయన్నారు. టీడీపీకి పోటీ చేసే పరిస్థితిని కల్పించి ఉంటే వాళ్లు 10 శాతం ఓట్లు దక్కించుకునే వారని జోస్యం చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే తాను ఏ పనీ చేయలేకుండా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని పనులూ ఆగిపోతాయన్నారు. కేసులతో రాజకీయ ప్రయోజనాల మాట పక్కన పెడితే... వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. తాను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ మాత్రమే ఉండరని... ప్రైవేటు ఇన్‌ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు ఉంటాయన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే బ్యాంకులు ఆ కంపెనీలకు ఒక్క రూపాయి అప్పు ఇవ్వవని తెలిపారు. ఓడీలను వెనక్కు తీసుకుంటాయన్నారు.
ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మంచిదా? చెడ్డదా? అనేది ఇప్పుడు విషయం కాదని... ప్రభుత్వాన్ని నిలుపుకోవాలన్నారు. ప్రభుత్వమే పోతే వాటి గురించి మాట్లాడుకోవడంలో అర్థం ఉండదన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ ఓట్లు తామే వేసుకుంటే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 సీట్లు గెలిచి ఉండేదన్నారు. మున్ముందు తమ ప్రత్యర్థిగా ఎవరు ఉంటారనేది బీజేపీ, కేసీఆర్ పనితీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. కేసీఆర్ విధానాన్ని బట్టి రాష్ట్ర రాజకీయాలు ఉంటాయన్నారు.
హరీశ్ రావు ట్రాప్‌లో కేసీఆర్ పడ్డారని... భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం కష్టమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమే అన్నారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్‌ను తీసుకోవచ్చునని హరీశ్ రావు చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఖతమైతే హరీశ్ ఒక కొత్త లైన్ తీసుకుంటారు. గతంలో ఈటల రాజేందర్‌ను మెడపట్టి బయటకు పంపింది హరీశ్‌రావు కాదా? నరేంద్ర, విజయశాంతిలను బయటికి పంపింది హరీశ్ కాదా? ఎప్పుడూ ఒక సమస్యను సృష్టించి.. తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటారు. నాకు నచ్చలేదు కాబట్టి కేసీఆర్ చిన్నోడేమీ అయిపోడు. అసెంబ్లీలోకి వచ్చి నిలుచుంటే ఆయనకు ఉండే మర్యాద ఆయనకు ఉంటుంది.
ఏపీలో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని... అందుకే మళ్లీ గెలిచారన్నారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి మాత్రం అలా లేదన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల సెటిలర్ల ఓట్లు బీజేపీకి పడి... మల్కాజ్‌గిరి, చేవెళ్లలో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరిందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను దించాలా? రేవంత్ రెడ్డిని గెలిపించాలా? అనే అంశంపైనే జరిగాయన్నారు. పదేళ్లు కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడానన్నారు. అందుకే ప్రజలు తనను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని పేర్కొన్నారు. పాలనలో తన మార్క్ ముద్ర వేస్తానన్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ ఉండి ఉంటే (బీజేపీ అధ్యక్షుడిగా) తన తర్వాత అవకాశం వచ్చేదేమో అన్నారు.
‘‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. మేం తొడగొట్టలేమా? ఎవరెవరు ఎప్పుడు కాంగ్రెస్‌లో చేరతారనేది ఇప్పుడే చెప్పలేం. అసలు పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆరే..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విషయంలో టీపీసీసీ సమన్వయలోపంతో గందరగోళం ఏర్పడిందని చెప్పారు.
త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఉంటాయని వెల్లడించారు.కాంగ్రెస్ అధిష్టానం నన్ను పీసీసీ అధ్యక్షుడిగా 2021 జూన్ 21న నియమించగా జూలై 7న బాధ్యతలు తీసుకున్నాను. ఈ ఏడాది జూలై 7న నా పదవీకాలం పూర్తవుతుంది. పీసీసీ బాధ్యతల నుంచి నన్ను తప్పించి సామాజిక న్యాయం పాటిస్తూ, సమర్థుడైన నాయకుడికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాను. త్వరలో అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా..’’ అని రేవంత్ చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో కూలిపోతుందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అంటే.. దానికి బీజేపీ వంత పాడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొడతామంటూ రోడ్ల మీద పడి రంకెలేస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీలను గాలికి వదిలేస్తే ఎలా? బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉంది.
ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్టు.. అసలు పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆరే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 61 మందిని తీసుకున్న కేసీఆర్ తప్పులు క్షమించాలంటూ.. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి.
కేసీఆర్ గత 10 ఏళ్లలో ఒక్కసారైనా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రతిపక్షాలను పిలిచారా? మేం అధికారికంగా ఆహ్వానం పంపాం. విద్యుత్‌పై విచారణ కమిషన్ వేయాలని మేం అడగలేదు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరారు. మరి మా ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడం తప్పా? వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ను అడగటం తప్పా? కమిషన్‌కు జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత వహిస్తుండడాన్ని తప్పు పడుతున్నారా?.. దీనిపై కేసీఆర్, జగదీశ్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రంలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. నా జీవితాశయం నెరవేరింది. కేసీఆర్‌ను ఓడిస్తానని, ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాను. అయ్యాను. రేవంత్‌రెడ్డి సీఎం అని 30 సెకన్లలో అధిష్టానం డిసైడ్ చేసింది. కేసీఆర్‌ను దింపాలనేది నా మొదటి లక్ష్యం. దానిని గుర్తించి ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ దిగిపోవడం, నేను గద్దెనెక్కడమే ఆయనకు పెద్ద గాయం. అంతకు మించింది ఏముంటుందన్నారు.