CM Revanth Reddy Indravelli Tour: త్వరలో మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్, నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Hyd, Feb 2: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.ఆదివాసీల ఇలవేల్పు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రాకతో ఇంద్రవెల్లి.. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయింది.
రేవంత్‌ను చూడగానే కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు అనంతరం కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Here's Video
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. స్కూల్ యూనిఫామ్‌లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న సీఎం.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని ప్రశ్నించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.60 కోట్లకుపైగా రుణాలు పంపిణీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ శ్రీకారం చుట్టారు. రూ. 5 కోట్లతో నాగోబా దేవాలయ గోపురం, ఇతర అభివృద్ధి పనులను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు.. మరో రూ. 6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను రేవంత్ సర్కార్ కేటాయించింది.