Indiramma House Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, భద్రాచలం స్వామివారి ఆశీర్వాదంతో పథకాన్ని ప్రారంభించామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
Bhadrachalam, Mar 11: భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. బడుగువర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని, పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలలకు , ప్రభుత్వ కాలేజీలకు ఉచిత విద్యుత్.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
రాష్ట్ర ప్రజల బాధలు చూసే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నాం. సొంతింటి కల సాకారం కోసం ప్రజలు పదేళ్లుగా ఎదురుచూశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకూ పట్టాలు ఇస్తాం. భారాస ప్రభుత్వం పేదవాడికి సొంతిల్లు ఇవ్వలేకపోయింది. భద్రాచలం అభివృద్ధికి మా వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు. పదేళ్ల పాలనలో రూ.7లక్షల కోట్ల అప్పు చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారు. మేం పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. ఆలయ ఈవో, వేదపండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు తుమ్మల (Tummala Nageshwarao), పొంగులేటి (Ponguleti Srinivas), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), సీతక్క (Seethakka), కొండా సురేఖ (Konda Surekhha), శ్రీధర్ బాబు (sridhar Babu), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూనంనేని, తెల్లం వెంకట్రావ్, కోరం కనకయ్య, రాగమయి, జారే ఆదినారాయణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.