Telangana Elections 2023: రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా, జాతీయ పార్టీలు మూలకు వెళతాయంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Hyd, Nov 15: 2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పడటం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. ఏక పార్టీ ప్రభుత్వం రాదు. అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే బీఆర్ఎస్ తడాఖా అప్పుడు ఢిల్లీలో చూపెడదాం అని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజల అండ ఉంటుందని ఆకాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణను ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తోందని అన్నారు. రైతు దుబారానా? అని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నాయకుల మాటలను ఎండగట్టారు. ఈ ప్రాంతానికి ఆనాడు నీళ్లు ఎందుకివ్వలేదని దుయ్యబట్టారు. ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
కేటీఆర్ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ
తలసరి ఆదాయంలో తెలంగాణ నేడు ప్రథమ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు లాంటి పథకాలను దేశంలో తెలంగాణ మాత్రమే అమలు పరుస్తోందని చెప్పారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాం. హిందూ, ముస్లిం, క్రైస్తవుల అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతున్నాం. అందర్నీ సమానంగా ఆదరిస్తున్నాం. ప్రతి స్కీంలో అందరూ భాగస్వామ్యం అవుతున్నాం. అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నాం. తెలంగాణ కల్చర్ గంగా జమునా తెహజీబ్. హిందూ, ముస్లింలు అందరూ సోదరుల్లా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఉదాహరణగా ఉంటున్నాం. పదేండ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు. బ్రహ్మాండంగా శాంతియుతంగా ముందుకు పోతున్నాం. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటెన్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నాం.. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుని మత కలహాలు సృష్టించిందని విమర్శించారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతోందని ఆరోపించారు. వంద ఉత్తరాలు రాసినా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీగాని నవోదయ పాఠశాల గానీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు.
సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే భయంకర పరిస్థితులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. 2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను 5016కు పెంచుతామని వెల్లడించారు.
బీజేపీ మనకు ఎంత మోసం చేసిందంటే.. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. 100 ఉత్తరాలు రాశాను కానీ ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలన్న చట్టాన్ని ఉల్లంఘించారు మోదీ. వంద సార్లు అడిగాను. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పరు.. నేను పెట్టలేదు. ఇందుకు ఐదేండ్లకు రూ. 25 వేల కోట్లు కట్ చేశారు. బడ్జెట్ కట్ చేసి, నవోదయ, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.
ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి జాజుల సురేందర్‌ను ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.‘రాష్ట్రం వచ్చిన ఏడాదిన్నర లోపే 24గంటల కరెంటును అన్నిరంగాలకు ఇస్తున్నాం. దాని తర్వాత మంచినీళ్ల బాధను పోగొట్టుకున్నాం. అంతకుముందు ఎండకాలం వచ్చిందంటే సర్పంచులకు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు బిందెల ప్రదర్శన కనిపించేది. మారుమూల తండా, గూడేల్లోని ఇంటింకి నల్లా పెట్టి నీరిస్తున్నాం. ఆ తర్వాత సాగునీటి కోసం ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి వెనుబడి ఉన్నది.
అందుకే నేను కామారెడ్డికి వచ్చిన. కామారెడ్డిలో పోటీ చేస్తున్నంటే ఎల్లారెడ్డి వేరే కాదు. రెండింటికి కలిపి ఎమ్మెల్యేగా ఉన్నట్టే లెక్క. సురేందర్ నాకు తమ్ముడు లాంటోడు. కుటుంబ సభ్యుడిలాంటోడు. నాకు దగ్గరి వ్యక్తి. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కష్టపడి చేసిన వ్యక్తి. ఎల్లారెడ్డిలో సురేందర్ ఎమ్మెల్యేగా ఉన్నా నేనే పని చేస్తా. ఇక్కడ అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి చూడబోతున్నరు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు ప్రతి విషయంలో తెలంగాణలోనే నెంబర్ వన్‌గా అయ్యింది ఎల్లారెడ్డి, మా కామారెడ్డి అని గర్వపడేలా చేస్తా’నన్నారు.
నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా నిస్వార్థపరుడు.. అలాంటి వ్యక్తి గెలిస్తే మన నిజామాబాద్‌కు ఎంతో లాభం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.సమైక్య రాష్ట్రంలో నిజామాబాద్ పట్టణం ఎలా ఉండేనో మీరందరూ చూశారు. నిజామాబాద్ పట్టణం ఆ రోజు ఎలా ఉండే.. ఇవాళ ఎలా ఉందో ఆలోచించండి. స్మశానవాటికలు, చెరువుల సుందరీకరణలు, రైల్వే బిడ్జి కింద నీళ్లు ఆగి ఇబ్బంది పడేది.. ఆ సమస్య పరిష్కారం కోసం రూ. 25 కోట్లు తెచ్చి బ్రిడ్జి కట్టించారు. పట్టణం కోసం రూ. 100 కోట్లు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ఐటీ సెంటర్‌కు కూడా తీసుకొచ్చారు.
నిజామాబాద్‌కు లాస్ట్ టైం వచ్చినప్పుడు.. ప్రత్యేకంగా పట్టణానికి రూ. 100 కోట్లు మంజూరు చేశాను. ఇందూరు కళాభారతి కోసం రూ. 55 కోట్లు మంజూరు చేశాను. నిజామాబాద్ పాత కలెక్టరేట్ జాగాలో ఇందూరు కళాభారతి నిర్మాణం అవుతోంది. పోలీసు కమిషనరేట్ బ్రహ్మాండంగా ఉంది. అవన్నీ మీ కండ్ల ముందున్నాయి. ఇవన్నీ మీరు గమనిస్తున్నారు. గతంలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కట్టుకున్నాం. మంచి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇలా అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారు. గత ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోలేదు అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రాల్లో ఐటీ కేంద్రాలు నెలకొల్పుతున్నాం. మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ, సిద్దిపేట వంటి పట్టణాల్లో ఐటీ సెంటర్లు వచ్చాయి. 24 గంటల హై క్వాలిటీ కరెంట్ ఉందని కంపెనీలు వస్తున్నాయి. మళ్లీ కాంగ్రెస్ వస్తే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కరెంట్ మూడు గంటలు ఇస్తే కంపెనీలు రావు.. ఇవన్నీ ఆలోచించండి అని కేసీఆర్ సూచించారు.
గణేష్ గుప్తా ఒక మంచి వ్యక్తి. స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు. పేదవాడు కాదు.. ఆయన నిరుపేద కాదు. ఆయనకున్న వ్యాపారాలు వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. వారికి ప్రజల డబ్బు అవసరం లేదు. నిస్వార్థంగా పని చేసే గుప్తా లాంటి వ్యక్తి గెలిస్తే మనకు చాలా లాభం జరుగుతుంది. పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. మీ అందరి ఆశీర్వచనంతో ఇందూరు కళాభారతిని నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తాను. కానుకగా ఇస్తాను అని కేసీఆర్ పేర్కొన్నారు.